నిజ్జర్‌ హత్య విషయంలో అమెరికన్ల మద్దతు మాకే : కెనడా ప్రధాని ట్రూడో

-

ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందంటూ ఇటీవల కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తత చెలరేగిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో నిజ్జర్ హత్య కేసు దర్యాప్తులో కెనడాకు సహకరించాలని ఇప్పటికే పలుమార్లు అమెరికా వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో అమెరికా వ్యాఖ్యలపై కెనడా ప్రధాని స్పందించారు. నిజ్జర్‌ హత్యపై అమెరికన్లు తమతోనే ఉన్నారని ట్రూడో ప్రకటించారు. తమ దేశం ఇప్పటికీ భారత్‌తో సన్నిహిత సంబంధాలను ఏర్పర్చుకోవడానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

మాంట్రియాల్లో జరిగిన ఓ సమావేశంలో ట్రూడో మాట్లాడుతూ భారత్‌ వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని.. కీలక భౌగోళిక రాజకీయ ప్రాధాన్యత ఉన్న దేశమని అన్నారు. గతేడాదే తాము ఇండో-పసిఫిక్‌ వ్యూహంతో ముందుకొచ్చామని.. భారత్‌తో సంబంధాలును బలోపేతం చేసుకోవడంపై తాము చాలా సీరియస్‌గా పనిచేస్తున్నామని ట్రూడో వ్యాఖ్యానించారు.

నిజ్జర్‌ హత్యపై మరోసారి ట్రూడో మాట్లాడుతూ పాతపాటే పాడారు. కెనడా, దాని మిత్రదేశాలు భారత్‌తో కలిసి నిర్మాణాత్మకంగా పనిచేయాల్సిన అవసరం ఉందని.. కానీ, అదే సమయంలో చట్టాలను అనుసరించే దేశంగా.. నిజ్జర్‌ హత్య విషయంలో తమతో కలిసి భారత్‌ పనిచేసి వాస్తవాలను వెలికితీయాలని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news