సాధారణంగా దేశాధ్యక్షుడి సతీమణిని ప్రథమ మహిళగా ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. ఒకవేళ అధ్యక్షుడి సతీమణి మరణించినట్లయితే ఎవరు ఆ స్థానంలో కొసాగుతారనేది ఆసక్తికరం. అయితే పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ (68) భార్య బెనజీర్ భుట్టో 2007లో హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన చిన్న కుమార్తె 31 ఏళ్ల అసీఫా భుట్టోను ప్రథమ మహిళగా నియమించనున్నట్లు సమాచారం. జర్దారీ పెద్ద కుమార్తె బఖ్తావర్ ఆదివారం చేసిన ట్వీట్ ఈ విషయాన్ని నిర్ధారించారు.
పాకిస్థాన్‌కు 14వ అధ్యక్షుడిగా జర్దారీ ఇటీవలే ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం సమయంలో చిన్న కుమార్తె అసీఫా ఆయన వెంటే ఉన్నారు. జర్దారీపై కోర్టు కేసుల విచారణ మొదలుకొని జైలు నుంచి విడుదల కోసం అసీఫా పోరాడారని, ఇప్పుడు ప్రమాణ స్వీకార సందర్భంలో ప్రథమ మహిళగా ఆయన వెంటే ఉన్నారని బఖ్తావర్ ట్వీట్‌లో పేర్కొన్నారు. 2008-2013 కాలంలో జర్దారీ మొదటిసారి దేశాధ్యక్ష పదవిని చేపట్టినప్పుడు ప్రథమ మహిళ స్థానం ఖాళీగానే ఉంది. రెండోసారి అధ్యక్షుడైన తరవాత చిన్న కుమార్తెకు ఆ హోదా ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. దీన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.