ఆందోళనలతో బంగ్లాదేశ్ వణికిపోయింది. ప్రధానిగా షేక్ హసీనా రాజీనామా చేసి దేశాన్ని విడిచి వెళ్లిన క్షణాల్లోనే అందోళనకారులు ప్రధాని అధికారిక నివాసమైన గణభాబన్‌ను ముట్టడించారు. క్షణాల్లో అక్కడ విధ్వంసం సృష్టించారు. విలువైన వస్తువుల్ని దోచుకెళ్లినట్లు స్థానిక మీడియా టెలికాస్ట్ చేసిన వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తోంది. కుర్చీలు, సోఫాలతో పాటు కూరగాయలు, చికెన్ కూడా లూటీ చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది.
దాదాపు 20 ఏళ్ల పాటు దేశాన్ని పాలించిన షేక్ హసీనా రాజీనామాతో ప్రజలు వీధుల్లోకి వచ్చి, జెండాలు ఊపుతూ సంబురాలు చేసుకున్నారు. ఇక ఢాకాలో పార్క్ చేసిన యుద్ధ ట్యాంక్‌పైకి ఎక్కి, డ్యాన్సులు చేశారు. ఉద్యోగాలు లేక అసహనంతో ఉన్న విద్యార్థులు ప్రభుత్వం తీసుకువచ్చిన రిజర్వేషన్ వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. 1971లో దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడినవారి కుటుంబ సభ్యులకు 30 శాతం కోటా కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన రిజర్వేషన్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. ఆదివారం ఒక్కసారిగా నిరసనలు మిన్నంటడంతో దాదాపు 300 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశాన్ని విడిచారు.
బంగ్లాదేశ్ : పార్లమెంట్ లోకి దూసుకెళ్లి హంగామా సృష్టించిన ఆందోళనకారులు. pic.twitter.com/4n5KHpWQZs
— ChotaNews (@ChotaNewsTelugu) August 5, 2024