బంగ్లాదేశ్‌లో రాజకీయ అనిశ్చితి నెలకొన్న వేళ ప్రస్తుతం ఆ దేశం సైనికుల పాలనలోకి వెళ్లింది. త్వరలోనే ఆ దేశంలో కొత్త సర్కార్ కొలువుదీరబోతోంది. ఈ నేపథ్యంలో త్వరలో ఏర్పడబోయే మధ్యంతర ప్రభుత్వానికి ప్రధాన సలహాదారుడిగా నోబెల్ గ్రహీత డాక్టర్ ముహమ్మద్ యూనస్‌ను నియమించాలని విద్యార్థి సంఘాల వేదిక ‘యాంటీ డిస్క్రిమినేషన్ స్టూడెంట్ మూవ్‌మెంట్’ డిమాండ్ చేసింది.
మధ్యంతర ప్రభుత్వ రూపురేఖలు ఎలా ఉండాలనే దానిపై 24 గంటల్లోగా ప్రతిపాదనలు ఇస్తామని చెప్పామని రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం నడిపిన వారిలో ఒకరైన నహీద్ ఇస్లాం అన్నారు. దేశ అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రొఫెసర్ ముహమ్మద్ యూనస్, మధ్యంతర ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా బాధ్యతలను స్వీకరించడానికి అంగీకరించారని ఇవాళ తెల్లవారు జామున సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ పెట్టారు నహీద్ ఇస్లాం. మరోవైపు సాధ్యమైనంత త్వరగా పార్లమెంటును రద్దు చేసి మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ కీలక ప్రకటన విడుదల చేశారు.