యావత్ ప్రపంచాన్ని షాక్ కు గురిచేసిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పుల ఘటన నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ ఓవల్ ఆఫీసు నుంచి జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమెరికాలో రాజకీయ హింస ముప్పు పెరుగుతోందని .. దీన్ని చల్లబర్చడానికి ఇదే సరైన సమయమని పిలుపునిచ్చారు. రాజకీయ ప్రయోజనాలు ఎంత ఉచ్ఛస్థితికైనా వెళ్లే అవకాశం ఉందని.. కానీ, హింసకు దారితీసే వరకు దిగజారొద్దని హితవు పలికారు.
అమెరికాలో ఇలాంటి ఘటనలకు అసలు తావులేదని బైడెన్ పునరుద్ఘాటించారు. అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వేడి రాజుకోవడం సహజమని.. అది శృతిమించకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మనం శత్రువులం కాదని.. సహోదరులమని ట్రంప్ ను ఉద్దేశించి పేర్కొన్నారు. వాద- ప్రతివాదాలు, విమర్శలు సహజమని.. చివరకు విభేదాలను బ్యాలెట్ బాక్సుల ద్వారా తేల్చుకుంటామని వివరించారు. ఇలాంటి కష్టసమయంలో యావత్ దేశం ఏకతాటిపై ఉండాల్సిన అవసరం ఉందని బైడెన్ పిలుపునిచ్చారు.