నేటి తరంలో చాలా మందిని వేధిస్తున్న సమస్య.. చాలా మంది శారీరక, మానసిక అనారోగ్యానికి.. కారణమవుతోంది.. నిద్ర. కొందరికి నిద్ర ఎక్కువై సమస్య.. మరికొందరికి అసలు నిద్ర పట్టక మరో సమస్య. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ నిద్ర గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు.
తాను మైక్రోసాఫ్ట్‌ను నెలకొల్పిన తొలినాళ్లలో నిద్రపోవడం సోమరితనంగా, అనవసరమైనదిగా భావించానని బిల్ గేట్స్ చెప్పారు. సేథ్ రోజన్, లారెన్ మిల్లర్‌తో కలిసి పాల్గొన్న ఓ పాడ్‌కాస్ట్‌లో బిల్‌గేట్స్ మాట్లాడారు. తాను 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయసులో నిద్ర బద్ధకం, అనవసరమని భావించి తాను నిద్రపోకుండా ఉండటానికి ప్రయత్నించానని బిల్ గేట్స్ వెల్లడించారు.
2020లో నిద్రపై తన అభిప్రాయం పూర్తిగా మారిపోయిందని బిల్‌గేట్స్ పేర్కొన్నారు. తన తండ్రి అల్జీమర్స్‌తో చనిపోవడమే అందుకు కారణమన్నారు. అప్పటి నుంచి నిద్రకు ప్రాధాన్యత ఇస్తున్నానని చెప్పారు. రోజూ ఎన్నిగంటలు నిద్రపోతున్నానో, ఎంత సుఖంగా నిద్రపోతున్నానో లెక్కలు వేసుకుంటున్నట్లు వివరించారు. బయటకు కనిపించే ఆరోగ్యం మాత్రమే ప్రధానం కాదని, మెదడు ఆరోగ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.