గత కొంతకాలంగాబ్రిటన్ ప్రభుత్వంలో అనిశ్చిత నెలకొంటుంది. రోజుకో రకంగా అక్కడి రాజకీయ పరిణామాల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా బ్రిటన్ ఉప ప్రధాని, న్యాయశాఖ మంత్రి డొమినిక్ రాబ్ తన పదవికి రాజీనామా చేశారు. తన మంత్రిత్వశాఖలోని సిబ్బంది పట్ల బెదిరింపులకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు పూర్తయింది. తాజాగా ఈ నివేదిక ప్రధాని రిషి సునాక్ చేతికి అందిన కొన్ని గంటల్లోనే రాబ్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ మేరకు ఆ దేశ ప్రధాని రిషి సునాక్‌కు రాసిన లేఖను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఈ దర్యాప్తును ఓ ప్రమాదకర దృష్టాంతంగా పేర్కొన్న రాబ్.. ప్రభుత్వానికి తన మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. దర్యాప్తులో ఏం తేలినా సరే.. మాటకు కట్టుబడి ఉండటమే ముఖ్యమని భావిస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు. వ్యక్తిగత ప్రవర్తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఇలా కీలక పదవులకు రాజీనామా చేసిన వారిలో డొమినిక్ రాబ్ మూడో వ్యక్తి కావడం గమనార్హం.