ఉత్తర కొరియాకు బయలుదేరిన చైనా డాక్టర్లు..! కిమ్‌ కోసమేనా..?

-

చైనా కమ్యూనిస్ట్‌ పార్టీకి చెందిన అంతర్జాతీయ సంబంధాల అధికారి నేతృత్వంలో ఒక డాక్టర్ల బృందం ఉత్తర కొరియాకు బయలుదేరివెళ్లింది. అధ్యక్షుడు కిమ్‌ ఆరోగ్య పరిస్థితిపై అయోమయం నెలకొని ఉండటంతో ఈ పర్యటన ప్రాముఖ్యత సంతరించుకుంది.

వైద్య నిపుణులతో కూడిన ఒక బృందాన్ని చైనా హుటాహుటిన ఉత్తర కొరియాకు పంపింది. ఉత్తర కొరియా అధ్యక్షుడి కిమ్‌ జాంగ్‌ ఉన్‌ ఆరోగ్యం విషమంగా ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ ప్రత్యేక పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.

చైనా అధికార కమ్యూనిస్ట్‌ పార్టీ కీలక నాయకుడి నియంత్రణలో ఒక ప్రతినిధి బృందం గురువారం బీజింగ్‌ నుండి ప్యాంగ్యాంగ్‌ వెళ్లినట్లు ఈ విషయంతో దగ్గరి సంబంధమున్న ముగ్గురు అధికారులు తెలిపారు. పార్టీ అంతర్జాతీయ సమన్వయ విభాగమే ఉత్తర కొరియాతో సంబంధాలను పర్యవేక్షిస్తుంది. అయితే కిమ్‌ ఆరోగ్యం గురించి ఎటువంటి సమాచారం వచ్చిందనేదానిపై సమాధానం ఇచ్చేందుకు వారు నిరాకరించారు.

నార్త్‌ కొరియా అధ్యక్షుడు కిమ్‌కు ఏప్రిల్‌ 12న హృదయ శస్త్రచికిత్స జరిగినట్లు, ఆయన కోలుకుంటున్నట్లు దక్షిణ కొరియాకు చెందిన న్యూస్‌ వెబ్‌సైట్‌ ‘ డైలీ ఎన్‌కే’ తెలిపింది. అయితే ఆ శస్త్రచికిత్స తర్వాత కిమ్‌ ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారి, తీవ్ర అస్వస్థతకు గురయ్యాడనీ, ‘బ్రెయిన్‌ డెడ్‌’ అయ్యాడని కూడా వార్తలు హల్‌చల్‌ చేసాయి. కాగా, ఈ వార్తలను సౌత్‌ కొరియా, చైనా వర్గాలు కొట్టిపడేసాయి. కిమ్‌ ఆరోగ్యంపై ఆందోళనకర సమాచారమేదీ తాము గుర్తించలేదని, ఉత్తర కొరియా కార్యకలాపాలు షరామామూలుగానే ఉన్నాయని దక్షిణ కొరియా తెలిపింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఈ విషయంపై ‘ నిరాధార వార్త’ని అంటూనే, ఖచ్చితమైన సమాచారం కోసం అమెరికా జరుపుతున్న సంప్రదింపులపై స్పందించడానికి నో చెప్పారు.

కిమ్‌ బతికేఉన్నాడని తన నిఘా వ్యవస్థ ధృవీకరించిందని తెలిపిన ద.కొరియా, త్వరలోనే ఆయన ప్రజల ముందుకు వస్తాడని ఆశిస్తున్నట్లు తెలిపింది. అయితే ఆయన ప్రస్తుత పరిస్థితిపై వ్యాఖ్యానించడానికి మాత్రం నిరాకరించింది. కిమ్‌ రాజధాని ప్యాంగ్యాంగ్‌ విడిచి ఒక రహస్య ప్రదేశంలో చికిత్స తీసుకుంటున్నట్లు అనుమానిస్తున్నారు. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్‌ పాంపియో మాత్రం, ప్రజలకు చెప్పడానికి తమ వద్ద ప్రస్తుతం ఎటువంటి సమాచారం లేదనీ, కాకపోతే, మేం పరిస్థితులను మాత్రం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లుగా చెప్పారు.

కిమ్‌ జాంగ్‌ ఉన్‌ (36) గత కొద్దిరోజులుగా మీడియాలో కనబడటంలేదు. మామూలుగానే ఉత్తర కొరియా ఒకరకంగా ఒంటరి దేశం. రహస్య ప్రదేశం. తన నాయకుల ఆరోగ్య విషయాలను జాతీయ భద్రతా

అంశంగా పరిగణిస్తూ, ఎటువంటి సమాచారమూ బయటకు పొక్కకుండా చూసుకుంటుంది. చివరిసారిగా ఏప్రిల్‌ 11న ఒక సమావేశానికి హాజరైన కిమ్‌, ఆ తర్వాత 15న జరిగిన ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు, తన తాతయ్య కిమ్‌ 2 సంగ్‌ జయంతికి హాజరుకాకపోవడం, బయటెక్కడా కనబడకపోవడంతో ఒక్కసారిగా ఆయన ఆరోగ్యంపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఊబకాయం, విపరీతమైన ధూమపానం, హృద్రోగ సమస్యలతో బాధపడుతున్న కిమ్‌ గుండెకు ఆపరేషన్‌ జరిగిందని, తదనంతరం, ఆరోగ్యవ్యవస్థలన్నీ విఫలమై, బ్రెయిన్‌ డెడ్‌ అయ్యాడని తొలుత వార్తలు చెలరేగాయి. కిమ్‌ తర్వాత ఎవరు అధ్యక్షులు అని కూడా విచారించారు.

అయితే, ఇప్పటికీ కూడా అదే అయోమయం కొనసాగుతోంది. ఆయన ఆరోగ్యం బాగాలేనప్పటికీ, చనిపోయాడని మాత్రం ఎవరూ ధృవీకరించడం లేదు. అయితే ఇప్పుడు చైనా డాక్టర్లు అక్కడికి వెళ్లడం మాత్రం ఆయన ఆరోగ్యానికి మరింత ధృడత్వం తేవడానికే అని చైనా వర్గాలు చెబుతున్నాయి.

ఏదేమైనా, కిమ్‌ ఉన్‌ జాంగ్‌కి మంచి ఆరోగ్యం, బుద్ధి రావాలని కోరుకోవడంలో తప్పులేదు కదా..

 

Read more RELATED
Recommended to you

Latest news