ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి రెండేళ్ల పాటు విధ్వంసం సృష్టించింది. లక్షల మందిని బలి తీసుకుంది. కోట్ల మందిని దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడేసింది. ఇప్పటికీ పలు దేశాల కరోనా సంక్షోభం నుంచి తేలుకోలేకపోతున్నాయ. ఇక ఈ మహమ్మారి తన రూపును మార్చుకుంటూ వివిధ వేరియంట్ల రూపంలో ఇంకా ఎక్కడో చోట విజృంభిస్తూనే ఉంది. తాజాగా సింగపూర్లో మళ్లీ కొవిడ్ కలకలం రేపుతోంది.
కొవిడ్-19 కేసులు మళ్లీ పెరుగుతున్నందున ప్రజలు రద్దీ ప్రాంతాలలో ముఖానికి మాస్క్ ధరించాలని సింగపూర్ ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. సింగపూర్‌లో డిసెంబరు 3-9వ తేదీల మధ్య కొవిడ్ కేసులు అంతకుముందు వారంకన్నా 75 శాతం పెరగడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. పరిస్థితి తీవ్రంగా ఏమీ లేదని ఆ దేశ ఆరోగ్య మంత్రి ఓంగ్ యే కుంగ్ చెప్పారు. దగ్గు, జలుబు వంటి సమస్యలతో బాధపడుతున్నవారు ఇంటిపట్టునే ఉండాలనీ ఆయన సూచించారు. అస్వస్థతకు గురైనవారిని సందర్శించేటపుడు మాస్క్ ధరించాలనీ పేర్కొన్నారు. విదేశీ ప్రయాణాలు చేసేవారు విమానాశ్రయంలో తప్పనిసరిగా మాస్క్ ధరించాలనీ, ప్రయాణంలో ఆరోగ్య బీమా తీసుకోవాలని సింగపూర్ సర్కార్ సూచనలు జారీ చేసింది.