కరోనాకు చెందిన డెల్టా వేరియెంట్ ను మొదట భారత్‌లో గుర్తించిన విషయం విదితమే. అయితే ఈ వేరియెంట్ ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ కేసుల పెరుగుదలకు ప్రస్తుతం కారణమవుతోంది. గత 4 వారాల్లోనే డెల్టా వేరియెంట్ కేసుల సంఖ్య 80 శాతం పెరిగింది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ఆస్ట్రేలియా, చైనాలలో డెల్టా వేరియెంట్ కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి. భారత్‌లో మొదట ఈ వేరియెంట్‌ను గుర్తించగా.. అది ప్రస్తుతం 132 దేశాల్లో వ్యాప్తి చెందుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు అనేక దేశాల్లో డెల్టా వేరియెంట్ కేసులు ఎక్కువగా వస్తున్నాయి. అందువల్ల ఈ వేరియెంట్ మరింత తీవ్రతరం కాకముందే తగిన చర్యలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ దేశాలకు హెచ్చరికలు జారీ చేస్తోంది.
ప్రపంచంలో అనేక చోట్ల గత 2 వారాల్లో కోవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. అమెరికాలోనూ కేసుల పెరుగుదల కనిపిస్తోంది. భారత్‌లోనూ గత వారం రోజులుగా కోవిడ్ కేసుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. దీంతో మూడో వేవ్ వస్తున్నట్లే ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అనేక చోట్ల కఠినమైన ఆంక్షలను విధిస్తున్నారు. ఆస్ట్రేలియాలో డెల్టా వేరియెంట్ వ్యాప్తి నేపథ్యంలో అక్కడ కఠిన ఆంక్షలను విధించి అమలు చేస్తున్నారు. అయితే ఇప్పుడే తగిన చర్యలు చేపడితే భారీ స్థాయిలో జరిగే నష్టాన్ని ముందుగానే నివారించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది.