ట్రంప్.. గ్రాఫ్ డౌన్ ట్రెండ్‌.. నోటి దూలే కార‌ణ‌మా…?

-

రాజ‌కీయాల్లో నాయ‌కుల‌కు దూకుడు ఉండాల్సిందే. కానీ, ఆ దూకుడు ప్ర‌యోజ‌నకరంగా ఉంటే మంచిది. కానీ, ఇటీవ‌ల కాలం లో నేత‌ల‌కు దూకుడు అర్ధ ర‌హితంగా ఉంటోంది. దీనికి ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌.. అగ్ర‌రాజ్యం అమెరికా అధ్యక్షుడేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఖ‌చ్చితంలో మ‌రో 30 రోజుల్లో అమెరికాలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ క్ర‌మంలో తాజా విశ్లేష‌ణల మేర‌కు అధ్య‌క్ష రేసులో ఉన్న ట్రంప్‌, జోబైడెన్‌ల గ్రాఫ్‌లో ట్రంప్ గ్రాఫ్ త‌గ్గుముఖం ప‌ట్టింద‌ని అంటున్నారు. ఇక‌, ఈ విష‌యం తెలిసిన నాటి నుంచి ట్రంప్ మ‌రింత‌గా దూకుడు పెంచార‌ని చెబుతున్నారు. ఈ దూకుడుతో ఆయ‌న అదుపు తప్పుతున్నార‌ని చెబుతున్నారు.

తాజాగా భార‌త్‌పైనాఆయ‌న నోరు పారేసుకున్నారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు కూడా భార‌త్‌ను కొనియాడిన ట్రంప్‌.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని భుజాన మోశారు. మోడీ నాయ‌క‌త్వానికి ఫిదా అంటూ కామెంట్లు కుమ్మ‌రించారు. కానీ, ఇప్పుడు అదే భార‌త్‌ను తిడుతున్నారు. క‌రోనా కేసుల్లో మ‌ర‌ణాల సంఖ్య‌ను భార‌త్ దాస్తోందంటూ.. వ్యాఖ్యానించారు. దీనిపై ఇప్పుడు స‌ర్వ‌త్రా ట్రంప్‌కు వ్య‌తిరేక‌త పెరుగుతోంది. అయితే, ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల వెనుక జోబైడెన్ దూకుడును క‌ట్ట‌డి చేసేందుకేన‌ని చెబుతున్నా.. వాస్త‌వానికి ఇలాంటి వ్యాఖ్య‌ల‌తో ట్రంప్ గ్రాఫ్ మాత్రం పెర‌గ‌డం లేదు.

ఇక‌, ఇద్ద‌రు అభ్య‌ర్థుల మ‌ధ్య తాజాగా జ‌రిగిన చ‌ర్చ‌లో నూ ట్రంప్ నోటి దూల స్ప‌ష్టంగా క‌నిపించింది. “నువ్వు అబ‌ద్దాల కోరువి. 47 ఏళ్ల‌లో అమెరికాకు నువ్వు చేసిందేంటి? “ అని ట్రంప్ విరుచుకుప‌డ్డారు. నిజానికి ఇద్ద‌రు అధ్య‌క్ష అభ్య‌ర్థుల మ‌ధ్య చ‌ర్చ జ‌రిగితే.. అది అర్ధ‌వంతంగా ఉండాలి. కానీ, ఆదిశ‌గా ట్రంప్ న‌డ‌వ‌లేక‌పోయారు. మ‌రోసారి అధ్య‌క్షుడు కావాల‌ని ఆయ‌న అనుకుంటున్నారే.. త‌ప్ప దీనికి సంబంధించిన లక్ష్యాన్ని చేరుకునేందుకు అనుస‌రించాల్సిన పంథాని మాత్రం ఆయ‌న పాటించ‌లేక పోతున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

నిన్న‌టి వ‌ర‌కు భారతీయ అమెరిక‌న్ల‌లో ఒకింత సానుకూల ధోర‌ణి ఉన్న‌ప్ప‌టికీ.. ఇప్పుడు ట్రంప్ ఓటు బ్యాంకు త‌గ్గింద‌నే వ్యాఖ్య‌ల‌తో వారు కూడా బైడెన్ వైపే మొగ్గుతున్నార‌ని తెలుస్తోంది. ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే.. ట్రంప్ ఓట‌మి కావ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

-vuyyuru subhash 

Read more RELATED
Recommended to you

Latest news