సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్‌లో వాణిజ్య ప్రకటనలను నిలిపివేసిన కంపెనీలపై ఎలాన్ మస్క్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. తాను చేసిన కొన్ని వ్యాఖ్యలను సాకుగా చూపించి బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అలాంటి వారి ప్రకటనలు తమకు అవసరం లేదని.. పోతే పొండి బెదిరించొద్దంటూ ధ్వజమెత్తారు. ‘ఎక్స్’కు వాణిజ్య ప్రకటనలను నిలిపివేసిన కంపెనీల జాబితాలో ఉన్న వాల్ట్ డిస్నీ సీఈఓ బాబ్ ఇగర్ పేరును ఎలాన్ మస్క్ నేరుగా ప్రస్తావించారు.
మరోవైపు ఇటీవల తాను ఓ యూదు వ్యతిరేక పోస్టుకు మద్దతునిచ్చినందుకు క్షమాపణలు చెప్పారు మస్క్. న్యూయార్క్ టైమ్స్ డీల్‌బుక్ సమ్మిట్‌లో మాట్లాడుతూ.. తాను ఇప్పటి వరకు చేసిన మెసేజ్‌లలో ఇదే అత్యంత దారుణమైన పోస్ట్ అని స్పష్టం చేశారు. ‘ఎక్స్’ నుంచి వాణిజ్య ప్రకటనలను ఉపసంహరించుకోవాలని చూస్తున్న వారికి ఇది ఆయుధంగా మారిందని మస్క్ పేర్కొన్నారు. తాను యూదు వ్యతిరేకినని ప్రచారం చేస్తూ తనను బెదిరించాలని చూడొద్దని.. అలాంటి వారి ప్రకటనలు తనకు అవసరం లేదని పోతే పొండి అంటూ మస్క్ చాలా కఠినంగా వార్నింగ్ ఇచ్చారు.