అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై దుండగుడు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని ఇంకా అనుమానిత స్థలంగానే పరిగణిస్తున్నట్లు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రకటించింది. దుండగుడు కాల్పులు జరిపిన ప్రదేశంలో ఇంకా కొన్ని అనుమానిత ప్యాకేజీలను గుర్తించినట్లు తెలిపింది. అవన్నీ పేలుడు పదార్థాలుగానే భావిస్తున్నట్లు చెప్పింది. అసలు కాల్పులు జరిపింది ఎవరనే విషయాన్ని ధ్రువీకరించే పరిస్థితిలో తాము లేమని ఎఫ్‌బీఐ ప్రత్యేక ప్రతినిధి కెవిన్ రోజెక్ అన్నారు. దుండగుడి లక్ష్యం ఏంటనేది కూడా ఇంకా తెలియడం లేదని దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
మరోవైపు కాల్పుల ఘటనకు సంబంధించిన సమాచారం ఉంటే తమకు తెలియజేయాలని ఎఫ్‌బీఐ కోరింది. ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేశామని.. వీడియోలు, ఫొటోలు సహా ఇతర సమాచారమేదైనా సరే తమతో పంచుకోవాలని విజ్ఞప్తి చేసింది. ట్రంప్ ప్రచార బృందం తమను ఎలాంటి అదనపు భద్రతను కోరలేదని తెలిపింది. కాల్పులు జరిగే వరకు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లకు ఎలాంటి హెచ్చరికలు లేవనేది ఇప్పటి వరకు తమకున్న సమచారమని వెల్లడించింది. దీనిపై ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని పేర్కొంది.