అతడు ఓ కంపెనీ సీఈఓ. అతడి నెల జీతంతో కొన్ని వందలు కుటుంబాలు సంతోషంగా గడపవచ్చు. అయితే క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీ స్నోఫ్లేక్ భారీ లాభాలను ఆర్జిస్తోంది. ఆ కంపెనీ ఊహించని విధంగా లాభాలు ఆర్జిస్తోంది. తాజాగా ఈ కంపెనీ ఈ ఏడాది మూడో త్రైమాసికం ఆదాయ వివరాలను వెల్లడించింది. ఇది గతేడాది కంటే రెట్టింపు అయినట్లు స్పష్టం చేసింది. సెప్టెంబర్ 15న తొలిసారి ఈ కంపెనీ పబ్లిక్ ఆఫరింగ్‌కు వెళ్లగా.. అప్పటి నుంచి ఇప్పటి వరకు షేరు ధర 223 శాతం పెరిగినట్లు తెలిపింది. ఈ దెబ్బతో కంపెనీ సీఈవో ఫ్రాంక్ స్లూట్‌మ్యాన్ ప్రపంచంలోనే ఎక్కువ మొత్తం అందుకుంటున్న ఎగ్జిక్యూటివ్‌ల జాబితాలో చేరిపోయారు.
ప్రస్తుతం సిఈవో ఫ్రాంక్ స్లూట్ మ్యాన్ నెల జీతం 10.8 కోట్ల డాలర్లు (సుమారు రూ.794 కోట్లు)కు చేరింది. ఈ మొత్తమంతా షేర్ల రూపంలో ఆయన ఖాతాలో జమవుతోంది. 2019 ఏప్రిల్‌లో సంస్థలో చేరినప్పటి నుంచీ నాలుగేళ్ల వరకు ఇవి ఇలా వచ్చి చేరుతూనే ఉంటాయి. ఇవి కాకుండా ఆయన ఏడాదికి బేస్ శాలరీగా 3,75,000 డాలర్లు అందుకుంటారు.
ఇక సంస్థ లాభాలను బట్టి ఇది ఎక్కువ కూడా కావచ్చు. 2023లో ఆయన ఖాతాలో ఉన్న షేర్లన్నింటినీ డబ్బు రూపంలో ఇస్తే ప్రస్తుత షేరు విలువ ప్రకారం ఆ మొత్తం 520 కోట్ల డాలర్లు (సుమారు రూ.38 వేల కోట్లు)గా ఉండనుంది. స్లూట్‌మ్యాన్ ఈ స్నోఫ్లేక్ సంస్థలో చేరడానికి ఆరు నెలల ముందు ఆ సంస్థ విలువ 350 కోట్ల డాలర్లు కాగా.. ఇప్పుడు అది కాస్తా.. 11000 కోట్ల డాలర్లకు చేరింది. స్లూట్‌మ్యాన్ గతంలో డేటా స్టోరేజ్ సంస్థ డేటా డొమేన్, క్లౌడ్ సర్వీస్ సంస్థ సర్వీస్‌నవ్ ఐఎన్‌సీలకు కూడా సీఈవోగా పని చేశారు.