ధర యుద్ధం మొదలయింది. మామూలుగా కాదు రష్యా ఉక్రెయిన్ కన్నా భారమయిన యుద్ధం ఇది.దేశ ఆర్థిక ప్రగతిని వినాశనం చేసే యుద్ధం ఇది.మన స్టాక్ మార్కెట్లు డౌన్ ఫాల్ అయి మన జీవితాలను ఛిన్నాభిన్నం చేసే యుద్ధం ఇది. ఎక్కడో యుద్ధం ఏంటి ఇక్కడ ప్రభావం ఏంటి అని మీరు కంగారు పడకండి. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ త్వరలోనే పతనం అవుతుంది. నవ్వులు మాయం అయి ప్రపంచంలో కన్నీళ్లు మిగలకుండా ఉండాలంటే దేశంలో ముందు జాగ్రత్త చర్యలు అవసరం. ఇప్పుడు పెట్రోలు రేట్లు బాగున్నాయి.బాగున్నాయి కదా అని సంబర పడకండి.
ఇప్పుడు బంగారం రేట్లు కూడా బాగున్నాయి.బాగున్నాయి కదా అని స్థిమితపడకండి. ఎందుకంటే ఇప్పటి వరకూ అంతా బాగానే ఉంది కానీ రేపు ఏమౌతుందో ఎవ్వరం చెప్పలేం. ఊహించని పరిణామాల నేపథ్యంలో ప్రపంచం అతలాకుతలం అయితే బహిరంగ మార్కెట్లో కదుపులూ కుదుపులూ తప్పవు.ఇప్పటికే కరోనా కారణంగా ఏమీ లేకుండా పోయిన మార్కెట్లకు ఊతం ఇచ్చే చర్యలు ఏమీ కేంద్రం తీసుకోకపోయినా కూడా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి.ఈ తరుణంలో మళ్లీ మార్కెట్లు ఒక్కసారిగా మళ్లీ పతనం చూస్తే పరాభవం తప్ప సామాన్యుడు మోసుకుపోయేది ఏమీ లేదు.
ముఖ్యంగా పెట్రో ధరలే కాదు డీజిల్ ధరలే కాదు బంగారం ధరలు కూడా పెరగనున్నాయి. వీటితో పాటు నిత్యావసర సరకుల ధరలు పెరిగిపోనున్నాయి. దీంతో మళ్లీ సామాన్యుడికి కష్టాలు తప్పవు. ఇప్పుడున్న ధరలకు ఇప్పుడున్న మార్కెట్ స్ట్రాటజీకి కాస్తో కూస్తో ఇబ్బందులున్నా ఒడ్డుకు రావడం సులువుగానే ఉంది. కానీ హైద్రాబాద్ మొదలుకుని సిద్ధిపేట వరకూ ధరలు రేపటి వేళ ఓ మోత మోగిస్తే బతకడం కష్టం.
మార్కెట్లో ఇవాళ బంగారం ధర
– 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 930 పెరిగి రూ. 51,110 కు చేరింది.
– 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 850 పెరిగి రూ. 46,850కు చేరింది.ఇప్పుడిప్పుడే తగ్గి ఉన్నాయి అనుకున్న బంగారం ధరలు భాగ్యనగరిలో ఈ విధంగా ఉంటే, సిద్ధిపేటలో 24 క్యారెట్ల బంగారం (పది గ్రాములు) 52,800 రూపాయలు పలుకుతోంది.రేపటివేళ వీటి ధరలు మరింత పెరిగే ఛాన్స్ కొట్టిపారేయలేం.
– అదేవిధంగా లీటర్ పెట్రోల్ ధర రూ.108.20 గా భాగ్యనగరిలో నమోదు కాగా లీటర్ డీజిల్ ధర రూ.94.62 గా ఉంది.
– వరంగల్ జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర 19 పైసలు పెరిగి…రూ.107.88 కు చేరుకుంది. అలాగే లీటర్ డీజిల్ ధర 17 పైసలు పెరిగి, రూ.94.31 గా నమోదైంది.బంగారం ధరలతో పాటు పెట్రో ధరలు కూడా క్రమక్రమంగా యుద్ధం ప్రభావంతో పెరిగేందుకు ఇప్పుడున్న పరిణామాలే ఊతం ఇస్తున్నాయి.