ఇజ్రాయెల్ హమాస్‌ల మధ్య ఉద్ధృత పోరు కొనసాగుతోంది. గాజాపై ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడుతోంది. ఇటీవల హమాస్ చెరలో ఉన్న నలుగురు బందీలను విడిపించేందుకు ఇజ్రాయెల్ నిర్వహించిన ఆపరేషన్లలో స్థానికంగా భారీగా ప్రాణనష్టం సంభవించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన హమాస్ ఇజ్రాయెల్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
ఒకవేళ టెల్‌అవీవ్ దళాలు ముందుకు చొచ్చుకొని వస్తున్నాయని భావిస్తే ఇజ్రాయెల్ బందీలను కాల్చివేయాలని తమ దళాలకు అగ్రనేతల నుంచి ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. గత ఏడాది అక్టోబరులో హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై మెరుపుదాడి చేసి దాదాపు 250 మందిని కిడ్నాప్ చేసి గాజాకు తరలించారు. నవంబరులో ఇరుపక్షాల నడుమ కాల్పుల విరమణ సమయంలో కొంతమందిని విడిచిపెట్టగా ఇంకా 120 మంది హమాస్ చెరలో ఉన్నారు. వారిని కాపాడటం టెల్‌అవీవ్‌కు సవాల్‌గా మారుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల నలుగురు బందీల కోసం చేపట్టిన ఆపరేషన్‌లో భారీగా గాజా పౌరులు మరణించారు.