మా నిర్ణయాలు మేం తీసుకుంటాం.. అమెరికాకు నెతన్యాహూ కౌంటర్

-

ఇజ్రాయెల్‌ ప్రధాన మంత్రి బెంజమిన్‌ నెతన్యాహు అమెరికాపై మండిపడ్డారు. ఆ దేశ న్యాయవ్యవస్థలో సంస్కరణల కోసం నెతన్యాహు ప్రతిపాదించిన కొత్త చట్టంపై పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలను నెతన్యాహు తిప్పికొట్టారు. తమది సార్వభౌమత్వ దేశమని.. విదేశీ ఒత్తిడి ఆధారంగా నిర్ణయాలు తీసుకోలేమని స్పష్టం చేస్తూ మిత్రదేశంపైనే ఘాటుగా స్పందించారు.

ఇజ్రాయెల్‌లో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌..  ‘ఇజ్రాయెల్‌కు మద్దతుదారుల మాదిరిగానే నేను కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నా. ఈ పరిస్థితులను చక్కదిద్దాలి. వాస్తవికత ఆధారంగా పరిస్థితులు చక్కదిద్దేందుకు ప్రధానమంత్రి రాజీకి వస్తారని ఆశిస్తున్నా. కానీ, ఏం జరుగుతుందో చూడాలి’ అని వ్యాఖ్యానించారు.

తమ దేశంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలపై ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ఘాటుగా స్పందించారు. ‘ఇజ్రాయెల్‌ సార్వభౌమ దేశం. ప్రజల అభీష్టం మేరకు నిర్ణయాలు తీసుకుంటుంది. అంతేకానీ, మిత్రులతో సహా విదేశాల ఒత్తిడితో కాదు’ అని అమెరికాను ఉద్దేశిస్తూ బెంజమిన్‌ నెతన్యాహు స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news