గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులను ముమ్మరం చేసింది. మరోవైపు గాజాలోని ఓ ఆస్పత్రిలో పేలుడు సంభవించి 500 మంది మరణించారు. ఈ ఘటనతో పశ్చిమాసియా దేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. అయితే ఈ దాడి ఇజ్రాయెల్ పనేనని అంతా భావిస్తున్నారు. హమాస్ కూడా ఈ ఘటన వెనక ఇజ్రాయెల్ ఉందని ఆరోపించింది. హమాస్ ఆరోపణలపై ఇజ్రాయెల్ స్పందించింది. ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హమాస్ ఆరోపణలను ఖండించారు. గాజాలో ఆస్పత్రిపై దాడి తమ పని కాదని.. అది ఉక్రమూకల చర్యేనని స్పష్టం చేశారు.
గాజాలోని అనాగరిక ఉగ్ర మూకలే.. అక్కడి ఆసుపత్రిపై దాడి చేశాయని నెతన్యాహు అన్నారు. ఈ దాడికి ఐడీఎఫ్ (ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్)కు ఎలాంటి సంబంధం లేదనే విషయాన్ని యావత్ ప్రపంచం తెలుసుకోవాలని పేర్కొన్నారు. తమ పిల్లలను అతి దారుణంగా హత్య చేసిన ఆ ఉగ్రవాదులు.. ఇప్పుడు వారి పిల్లలను కూడా చంపేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు ఆసుపత్రి సమీపంలో పీఐజే మిలిటెంట్లు ప్రయోగించిన రాకెట్ గురితప్పి ఆసుపత్రిలో పేలుడు సంభవించిందని ఐడీఎఫ్ వెల్లడించింది.