పస్చిమాశియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తతంగా మారనున్నాయా? ఇరాన్ – ఇజ్రాయెల్ల తీరు చూస్తుంటే అది ఖాయమేనని అనిపిస్తోంది. ఇటీవలే ఇజ్రాయెల్పై ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో దాడికి తెగబడిన విషయం తెలిసిందే. అయితే వీటిని ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ సమర్థంగా తిప్పికొట్టింది. కానీ తమ దేశంపై ఇరాన్ జరిపిన దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని తాజాగా ఇజ్రాయెల్ ప్రకటించింది. ఆ దేశంపై ప్రతిదాడి తప్పదని స్పష్టం చేసింది. ఆపరేషన్ ‘ఐరన్ షీల్డ్’ పేరుతో ప్రతిపాది చేస్తామని హెచ్చరించింది.
తమ వ్యూహాత్మక సామర్థ్యాలను దెబ్బతీయాలని ఇరాన్ భావించిందని ఇజ్రాయెల్ రక్షణ బలగాల అధిపతి లెఫ్టినెంట్ జనరల్ హెర్జిహలేవి అన్నారు. ఇలాంటి ఘటనలు మునుపెన్నడూ జరగలేదని, ఇప్పుడు స్పందించకుండా మౌనం వహిస్తే భవిష్యత్తులో ఇరాన్ నుంచి మరింత ముప్పు ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్ విషయం తేలే వరకు గాజాలోని రఫాపై ఆపరేషన్‌ను నిలిపివేయాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు నిర్ణయించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొనడం గమనార్హం.