భద్రాద్రి వాసుల కష్టాలు సగం తీరినట్టే. గోదావరి నదిపై భద్రాచలం వద్ద నిర్మించిన రెండో వంతెన ప్రారంభమైంది. కలెక్టర్ ప్రియాంక అల, ఎస్పీ రోహిత్‌రాజ్ ప్రారంభించగా.. ఉన్నతాధికారులు నూతన వంతెనపై తమ వాహనాలు నడిపారు. మిగతా వాహనదారులు సారపాక వైపు నుంచి భద్రాచలం వైపునకు రాకపోకలు సాగించారు.
2015 ఏప్రిల్ 1వ తేదీన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, అప్పట్లో రాష్ట్ర రహదారులు, భవనాల శాఖామంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు ఈ వంతెనకు శంకుస్థాపన చేశారు. అనంతరం వివిధ కారణాలతో నిర్మాణం జాప్యం కాగా.. ఇటీవల మళ్లీ మంత్రి పదవి చేపట్టిన తుమ్మల నాగేశ్వరరావు పనులను పూర్తి చేయించేందుకు చొరవచూపారు. శ్రీరామనవమికల్లా కొత్త వంతెనను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించడంతో అధికారులు పనులు వేగవంతం చేయించారు. ఇప్పటికే ఉన్న పాత బ్రిడ్జితో పాటు దీన్ని పూర్తిస్థాయిలో ప్రయాణికులు, భక్తులకు అందుబాటులోకి తెచ్చారు. వంతెన అందుబాటులోకి రావడంతో భద్రాచలం వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమకు రవాణా సమస్య కాస్త తీరినట్టేనని అంటున్నారు.