భారత ప్రధాని నరేంద్రమోదీకి మరోసారి ప్రశంసలు వెల్లువెత్తాయి. ఆయన అద్భుతమైన పనితీరు ప్రదర్శించారని ఆర్థిక సేవల సంస్థ జేపీ మోర్గాన్ ఛేజ్ సీఈఓ జేమీ డిమోన్ కొనియాడారు. ఎకనామిక్ క్లబ్ ఆఫ్ న్యూయార్క్ అనే సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. మోదీ పాలనలో తీసుకువచ్చిన సంస్కరణలను ఆయన ప్రశంసించారు. “భారత్‌లో ప్రతీ పౌరుడిని గుర్తించే వ్యవస్థ (ఆధార్) ఉంది. 700 మిలియన్ల బ్యాంకు ఖాతాలున్నాయి. సానుకూల మార్పు దిశగా ఆయన కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. అలాంటి వైఖరిని మన నేతలు పాటించాల్సిన అవసరం కాస్త ఎక్కువే ఉంది’’ అని అమెరికన్లను ఉద్దేశించి జేమీ డియోన్ వ్యాఖ్యానించారు.
భారత నాయకుడి ముందు ఎన్నో సవాళ్లు ఉన్నప్పటికీ.. ఆయన తన దేశాన్ని ఎలా నడిపిస్తున్నారన్నది యూఎస్ అధికారులు ఆలోచించుకోవాలని జేమీ అన్నారు. మోదీ అద్భుతమైన పనితీరు చూపారని.. 400 మిలియన్ల మందిని పేదరికం నుంచి బయటపడేశారని తెలిపారు. వారు మనతో వ్యాపారం చేద్దామనుకున్నప్పుడు మనం వెళ్లి, ఉపన్యాసం ఇస్తామని.. పనులు ఎలా చేయాలో పాఠాలు చెప్తామని.. భారత్‌లో అద్భుతమైన విద్యావ్యవస్థ, మౌలిక సదుపాయాలు ఉన్నాయని పేర్కొన్నారు. సంక్లిష్టంగా ఉన్న పన్ను వ్యవస్థను సంస్కరించారని చెప్పారు.