నిజ్జర్‌ హత్య కేసు నిందితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో

-

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్టు వ్యవహారంపై కెనడా దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందించారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతుందని.. కెనడాలో ఉన్న ప్రతి వ్యక్తికి భద్రతతో జీవించే హక్కు ఉందని అన్నారు. తమ దేశంలో చట్టబద్ధమైన పాలన సాగుతోందని తెలిపారు. తమ దేశం స్వతంత్ర, బలమైన న్యాయవ్యవస్థ కలిగి ఉందన్నారు. తమ పౌరులను రక్షించడమే ప్రభుత్వ కర్తవ్యమని వ్యాఖ్యానించారు. నిజ్జర్‌ మృతి తర్వాత కెనడాలోని ఓ వర్గం అభద్రతతో జీవిస్తోందని చెప్పుకొచ్చారు.

నిజ్జర్‌ హత్యలో భారత ఏజెంట్ల జోక్యం ఉందంటూ గత ఏడాది సెప్టెంబరులో ట్రూడో (Trudeau) చేసిన నిరాధార ఆరోపణలు తీవ్ర దుమారం రేపడంతో పాటు ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణింపజేశాయి. తాజాగా నిజ్జర్‌ కేసులో భారత్‌కు చెందిన ముగ్గురు నిందితులు కరణ్‌ప్రీత్‌ సింగ్‌, కమల్‌ప్రీత్‌ సింగ్‌, కరణ్‌ బ్రార్‌ను కెనడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముగ్గురు నిందితులకు పాక్‌లోని ఐఎస్‌ఐతో సంబంధాలున్నట్లు భారత వర్గాలు అనుమానిస్తున్నాయి. కొంతమంది గ్యాంగ్‌స్టర్లు కెనడాలో ఉంటూ భారత్‌లో తమ నేర కార్యకలాపాలను సాగిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news