బోరిస్ జాన్సన్ తర్వాత బ్రిటన్ రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. పోటాపోటీగా ఉత్కంఠగా సాగిన ప్రధాని ఎన్నికల్లో రిషి సునాక్ పై లిజ్ ట్రస్ ఘన విజయం సాధించారు. కానీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన 40 రోజుల్లోనే ఆమె తన పదవికి రాజీనామా చేశారు. ఇక రిషి సునాక్ కు లైన్ క్లియర్ అయిందని భావిస్తున్న తరుణంలో బోరిస్ జాన్సన్ మళ్లీ లైన్ లోకి వచ్చారు.
బ్రిటన్ నూతన ప్రధానిగా ఎవరు బాధ్యతలు చేపడతారనే ఉత్కంఠ కొనసాగుతున్న తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కన్జర్వేటివ్ నాయకుడిగా తనకు చట్టసభ సభ్యుల మద్దతు ఉన్నా రిషి సునాక్ కంటే వెనకబడి ఉన్నానని.. ఇటువంటి సమయంలో పోటీ నుంచి వైదొలగడమే మేలని మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ వెల్లడించారు. ఇలా కీలక వ్యక్తి పోటీ నుంచి వైదొలగడం, మరో నాయకురాలు పెన్నీ మోర్డాంట్‌కు మెజారిటీ అంతంత మాత్రంగానే కనిపిస్తుండడంతో బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ విజయానికి మార్గం సుగమమైనట్లేనని తెలుస్తోంది. దీనిపై ఇవాళ మధ్యాహ్నంలోపే స్పష్టత రానుండడంతోపాటు.. ఒకవేళ అన్నీ అనుకూలిస్తే దీపావళి రోజునే భారత సంతతి వ్యక్తి బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టే అవకాశం కనిపిస్తోంది.