మాల్దీవుల్లో వందలాది మంది భారత సైనికులు ఉన్నారంటూ అధ్యక్షుడు మహమ్మద్ మయిజ్జు మరోసారి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయన చేసిన ఆరోపణలను ఆ దేశ విదేశాంగ శాఖ మాజీ మంత్రి అబ్దుల్లా షాహిద్ కొట్టిపారేశారు. తమ దేశ భూభాగంలో సాయుధులైన విదేశీ సైనికులెవరూ లేరని తెలిపారు. ఎన్నికల సమయంలో చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించలేకే మయిజ్జు అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. 100 రోజుల పాలనలో అనేక అసత్యాలు ప్రచారం చేశారని.. అందులో ఇదొకటని తీవ్రంగా మండిపడ్డారు.
గతంలో అధికారంలో ఉన్న ‘మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ’ వల్లే అనేక మంది భారత సైనికులు దేశంలోకి ప్రవేశించారని ఎన్నికల సమయంలో మయిజ్జు ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఇదే నినాదంతో ఆయన ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు పొందే ప్రయత్నం చేశారని ఎండీపీ పేర్కొంది. కానీ, ఇండియాతో అలాంటి ఒప్పందాలు కుదిరినట్లు అధికారంలోకి వచ్చాక నిరూపించలేకపోతున్నారని తాజాగా అబ్దుల్లా షాహిద్ పేర్కొన్నారు. ప్రజల విశ్వాసం కోల్పోతామనే భయంతోనే మయిజ్జు పదే పదే అబద్ధాలు వల్లెవేస్తున్నారని ఆరోపించారు.