భారత్‌తో దౌత్యపరమైన ఉద్రిక్తతల వేళ మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత వ్యతిరేక వైఖరిపై ఆయన ఏ మాత్రం వెనక్కితగ్గడం లేదు. తాజాగా ఆ దేశ పార్లమెంటులో ప్రసంగిస్తూ తమ దేశంలో ఉన్న భారత్ బలగాల ఉపసంహరణ మే 10వ తేదీ నాటికి పూర్తవుతుందని వ్యాఖ్యానించారు. ‘మా సార్వభౌమత్వం విషయంలో మరొక దేశం జోక్యాన్ని మేం అనుమతించం’ అని స్పష్టం చేశారు.
స్థానిక మీడియా కథనాల ప్రకారం.. మన దేశంలో ఉన్న మూడు వైమానిక స్థావరాల్లో ఒక దానిలో విధులు నిర్వర్తిస్తోన్న బలగాలు మార్చి 10లోగా వెళ్లిపోతాయి. మిగతా రెండు స్థావరాల్లో ఉన్న దళాలు మే 10 నాటికి వైదొలుగుతాయి. ఈ విషయంలో భారత్‌తో ఉన్న ఒప్పందాన్ని పునరుద్ధరించుకోవడం లేదు. అని ఈ ఏడాది పార్లమెంటులో తన తొలి ప్రసంగంలో మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు వ్యాఖ్యానిం చినట్లు ఆ దేశ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ బలగాల ఉపసంహరణపై రెండు దేశాలు ఒక అంగీకారానికి వచ్చినట్లు ఇప్పటికే అంతర్జాతీయ కథనాలు వెల్లడించిన విషయం తెలిసిందే.