బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం కొలువుదీరింది. తాత్కాలిక ప్రభుత్వ సారథిగా గురువారం రాత్రి నోబెల్ పురస్కార గ్రహీత ముహమ్మద్ యూనుస్ ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్షుడు షహబుద్దీన్ యూనస్ చేత ప్రమాణం చేయించారు. ప్రధానమంత్రి హోదాకు సమానమైన ముఖ్య సలహాదారుగా యూనుస్ వ్యవహరించనున్నారు.
పారిస్ నుంచి మధ్యాహ్నం ఢాకా చేరుకున్న ఆయన విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. అల్లర్లకు అడ్డుకట్టవేసి దేశ పునర్నిర్మాణాన్ని చేపట్టాలని అన్నారు. దాని కోసం ప్రజలు తనకు సహకరించాలని కోరారు. షేక్ హసీనా రాజీనామాతో దేశానికి మరోసారి స్వాతంత్య్రం వచ్చినట్లయిందని పేర్కొన్నారు. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు.
మైనారిటీలపై దాడుల్ని నిలువరించి, శాంతి, భద్రతల్ని పునరుద్ధరించడం మొదటి కర్తవ్యమని పేర్కొన్నారు. విద్యార్థులు, యువత కోరితే పాలనా పగ్గాలు చేపట్టడానికి తాను ముందుకు వచ్చానని అన్నారు. బంగ్లాదేశ్ ఇప్పుడు యువత చేతిలో ఉన్నందువల్ల వారి ఆకాంక్షలు, సృజనకు తగ్గట్టుగా పునర్నిర్మాణాన్ని చేపట్టాల్సి ఉందని తెలిపారు. దేశంలో హిందువులు, ఇతర మైనారిటీలకు భద్రత లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.