రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటు చూసి కాసేపు నాటో దేశాలు ఆనందించినా.. ఆ తర్వాత మాత్రం నాటో కూటమిలో గుబులు షురూ అయింది. దానికి కారణం.. తిరుగుబాటు చేసిన కొద్ది గంటల్లోనే వెనక్కి తగ్గిన వాగ్నర్ గ్రూప్ అధిపతి ప్రిగోజిన్ బెలారస్‌లోకి అడుగుపెట్టం. ప్రిగోజిన్‌తో పాటు వాగ్నర్ దళాలు బెలారస్‌లో ఆశ్రయం పొందటానికి పుతిన్ ఉదారంగా అనుమతించటంపై అనుమానాలు మొదలయ్యాయి. ఎందుకంటే బెలారస్‌కు ఆనుకుని పలు నాటోదేశాలున్నాయి. ప్రిగోజిన్‌తో పాటు బెలారస్‌లో అడుగుపెట్టిన వాగ్నర్ దళాలు తమకు ముప్పుగా పరిణమిస్తాయనేది సరిహద్దు దేశాల భయం.
ఈ నేపథ్యంలో వచ్చేనెల 11న అమెరికా సారథ్యంలోని నాటో దేశాలన్నీ భద్రతపై సమీక్ష కోసం సమావేశం కాబోతున్నాయి. దానికి 31 నాటో దేశాలు హాజరవుతాయి. ‘‘ఏం జరుగుతోందో ఇప్పటికిప్పుడు ఏమీ చెప్పలేకున్నా… మా జాగ్రత్తలో మేం ఉన్నాం. మాస్కోతో పాటు మిన్స్క్ (బెలారస్ రాజధాని)కు కూడా ఒకే విషయం స్పష్టం చేస్తున్నాం. నాటో భూభాగంలో ప్రతి అంగుళాన్నీ కాపాడుకుంటాం. అన్ని దేశాల భద్రతపై ముఖ్యంగా బెలారస్ సరిహద్దుల్లోని దేశాల రక్షణపై నిర్ణయం తీసుకుంటాం’’ అని నాటో చీఫ్ జెన్స్ స్టోల్తెన్‌బర్గ్ స్పష్టం చేశారు.