పాకిస్థాన్ ముస్లిం లీగ్ – నవాజ్ (పీఎంఎల్-ఎన్) అధ్యక్షుడిగా పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ మళ్లీ ఎన్నికయ్యారు. లాహోర్ వేదికగా మంగళవారం నిర్వహించిన పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఏకగ్రీవంగా ఆయన పేరు ఖరారయింది. మూడుసార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నవాజ్.. పనామా పేపర్ల కేసులో పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఆయన నాలుగేళ్ల క్రితం లండన్ వెళ్లిపోయి, గతేడాది అక్టోబర్‌లోనే స్వదేశానికి తిరిగొచ్చారు. దాదాపు ఆరేళ్ల తర్వాత పార్టీ బాధ్యతలు ఆయన చేతికి వెళ్లడం గమనార్హం. నవాజ్ పదవిలో ఉండగా 1998, మే 28వ తేదీన పాక్ తొలిసారి అణు పరీక్షలు చేపట్టారు. ఆ చారిత్రక ఘట్టానికి 26 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రోజే ఆయన పార్టీ బాధ్యతలు చేపట్టడం గమనార్హం.