హమాస్ నియంత్రణలోని గాజా స్ట్రిప్‌లో తాత్కాలిక కాల్పుల విరమణకు అవకాశమే లేదని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు పునరుద్ఘాటించారు. హమాస్ మిలిటెంట్లు తమ వద్ద ఉన్న బందీలను విడుదలచేసే వరకు దాడులను ఉద్ధృతం చేయటం తప్ప తగ్గించేది లేదని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో సమావేశం తర్వాత నెతన్యాహు చెప్పారు. గాజాలో మానవతా పరిస్థితులు మెరుగుపర్చేందుకు తాత్కాలికంగా కాల్పుల విరమణ ప్రకటించేలా ఇజ్రాయెల్‌ను ఒప్పించేందుకు ఆయన ఆ దేశంలో పర్యటిస్తున్నారు.
దాడుల నుంచి పౌరులకు రక్షణ కల్పించేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాలని ఇజ్రాయెల్‌కు బ్లింకెన్ సూచించారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ కాల్పుల విరామాలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ విషయంపై నెతన్యాహుతో చర్చలు జరిపినట్లు తెలిపారు. గాజాలో హమాస్‌ను పూర్తిగా మట్టుబెడతామన్న హెచ్చరికలకు తాము కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ఇజ్రాయెల్ తనకున్న సైనిక శక్తితో దాడులు కొనసాగిస్తుందని, బందీలు విడుదలయ్యే వరకూ కాల్పుల విరమణకు అవకాశమే లేదని ఆ దేశ ప్రధాన మంత్రి నెతన్యాహు స్పష్టం చేశారు.