ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడాలో ముగ్గురు భారత సంతతికి చెందిన వ్యక్తులు అరెస్టయిన విషయం తెలిసిందే. అయితే ఈ ముగ్గురికి పాకిస్థాన్ ఐఎస్‌ఐతో సంబంధాలున్నట్లు సమాచారం. ఈ మేరకు ఓ ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి.
ఎడ్మంటన్ ప్రాంతంలో నివాసముంటున్న నిందితులు కరణ్‌ప్రీత్ సింగ్ (28), కమల్‌ప్రీత్ సింగ్ (22), కరణ్ బ్రార్ (22)లను కెనడా పోలీసులు అరెస్టు చేశారు. కొంతమంది గ్యాంగ్‌స్టర్లు కెనడాలో ఉంటూ భారత్‌లో తమ నేర కార్యకలాపాలను సాగిస్తున్నారని ఇంగ్లీష్ మీడియా కథనం పేర్కొంది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) నిందితులుగా పేర్కొన్న చాలా మంది ఆ దేశంలో స్థిరపడ్డారని వెల్లడించింది. భారత వ్యతిరేక, ఖలిస్థానీ అనుకూల కార్యకలాపాలు సాగించేందుకు వారికి పాక్ ఐఎస్‌ఐ నుంచి నిరంతరం నిధులు అందుతున్నాయని.. దీని గురించి తాము చాలా సార్లు అనేక ఆధారాలు ఇచ్చినా.. కెనడా ప్రభుత్వం గానీ, పోలీసుల నుంచి ఎలాంటి మద్దతు లభించలేదని సదరు వర్గాలు మీడియాకు వివరించాయి. మరోపక్క నిజ్జర్ హంతకులపై ఫస్ట్ డిగ్రీ హత్య కేసు అభియోగాలు మోపినట్లు కెనడా అధికారులు వెల్లడించారు.