రంజాన్ సందర్భంగా గాజాలో కాల్పుల విరమణ పాటించాలని డిమాండ్ చేస్తూ, బందీలను హమాస్ విడుదల చేయాలని కోరుతూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాన్ని ఆమోదించింది. మొత్తం 15 సభ్య దేశాల్లో 14 తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయగా.. అమెరికా వీటో జారీ చేయకుండా తీర్మానం ఆమోదం పొందేందుకు ఓటింగ్కు దూరంగా ఉంది. అయితే గాజాలో కాల్పుల విరమణ కోసం రెండు వైపుల నుంచి వచ్చిన డిమాండ్లను ఇరు పక్షాలు పరస్పరం అంగీకరించలేదు. దీంతో రంజాన్ మాసంలో కాల్పుల విరమణ కోసం ప్రపంచ దేశాలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
తొలుత ఇజ్రాయెల్ డిమాండ్లను హమాస్ అంగీకరించకపోవడంతో ఆ తర్వాత ఇజ్రాయెల్ కూడా సమ్మతించలేదు. హమాస్ డిమాండ్లకు అంగీకరించడం లేదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కార్యాలయం విడుదల చేసిన ప్రకటన తెలిపింది. కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలకు హమాస్ పెద్దగా ఆసక్తి చూపడం లేదని ప్రకటనలో పేర్కొంది. ఇది భద్రతా మండలి నిర్ణయానికి పెద్ద దెబ్బని వ్యాఖ్యానించింది.