బ్రిటన్ ప్రధాని పదవికి పోటీ పడుతున్న భారత సంతతి నేత, మాజీ ఆర్థికమంత్రి రిషి సునాక్ పుంజుకున్నారు. కన్జర్వేటివ్ పార్టీ సభ్యులకు గతవారం నిర్వహించిన పోల్‌లో తన ప్రత్యర్థి, విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్‌తో ఉన్న అంతరాన్ని గణనీయంగా తగ్గించుకోగలిగారు. ప్రస్తుతం ఇద్దరు నేతల మధ్య కేవలం 5 శాతం మాత్రమే తేడా ఉంది.
ఇటలీకి చెందిన ప్రజా వ్యవహారాల కంపెనీ టెక్నీ.. గతవారం 807 మంది కన్జర్వేటివ్ సభ్యులను సర్వే చేసింది. అందులో రిషి సునాక్‌కు 43% మంది, లిజ్ ట్రస్‌కు 48% మంది మద్దతు పలికారు. 9% మంది మాత్రం ఏ విషయాన్నీ వెల్లడించలేదు. మరోవైపు, గతవారం బ్రిటిష్ అంతర్జాతీయ మార్కెట్ పరిశోధన సంస్థ ‘యూగవ్’ నిర్వహించిన సర్వేలో లిజ్ ట్రస్‌కు 62% మంది నుంచి మద్దతు లభించగా, రిషికి 38% మంది మద్దతిచ్చారు. ఇద్దరి మధ్య వ్యత్యాసం 24% కనిపించింది. ఇప్పుడు అది అయిదుకు తగ్గడం సునాక్‌కు ఊరటనిచ్చే అంశమే.
పలు వివాదాల్లో కూరుకుపోయిన బోరిస్ జాన్సన్ ఈ నెల 7వ తేదీని ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో తదుపరి ప్రధానిని ఎన్నుకునేందుకు అధికార కన్జర్వేటివ్ పార్టీ ప్రక్రియ చేపట్టింది. పార్టీ అధ్యక్ష పదవికి, తద్వారా ప్రధాని పదవికి ఎన్నిక మొదలవ్వగా.. ఇందుకోసం తొలుత 11 మంది పోటీ పడ్డారు. అనేక రౌండ్ల అనంతరం తుది రేసులో మాజీ ఆర్థిక మంత్రి సునాక్, మాజీ విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్ నిలిచారు.