స్థానిక సంస్థల ఎన్నికల్లో రిషి సునాక్‌ పార్టీకి ఎదురుదెబ్బ

-

బ్రిటన్‌ ప్రధాన మంత్రి రిషి సునాక్‌కు చెందిన కన్జర్వేటివ్‌ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక సంస్థల్లో ఈ పార్టీకి ప్రతికూల ఫలితాలు ఎదురవుతున్నాయి. కౌన్సిల్‌ ఎన్నికల్లో అధిక స్థానాల్లో ఆ పార్టీ ఓటమి దిశగా సాగుతోంది. ఇంగ్లాండ్‌లో 230 స్థానిక సంస్థల్లోని 8 వేలకు పైగా కౌన్సిల్‌ సీట్లకు గురువారం ఎన్నికలు జరిగాయి. రిషి సునాక్‌ ప్రధాని పీఠమెక్కిన తర్వాత నిర్వహించిన తొలి ఎన్నికలు ఇవే కావడంతో సర్వత్రా ఆసక్తి వ్యక్తమైంది.

అయితే తొలి ఎన్నికల పరీక్షలో సునాక్‌కు ప్రతికూల ఫలితాలే వస్తున్నాయి. ఇప్పటివరకూ వెల్లడైన ఫలితాల్లో కన్జర్వేటివ్‌ పార్టీకన్నా ప్రతిపక్ష లేబర్‌ పార్టీనే ఎక్కువ సీట్లు గెలుచుకొని మెజార్టీ దిశగా దూసుకెళ్తోంది. గత ఎన్నికలతో పోలిస్తే అధికార కన్జర్వేటివ్‌ పార్టీ ఇప్పటికే దాదాపు 250 స్థానాలను కోల్పోయింది. కన్జర్వేటివ్‌ పార్టీ 20 ఏళ్లుగా గెలుస్తున్న మెడ్‌వే సహా మరికొన్ని కీలక స్థానాలను లేబర్‌ పార్టీ  కైవసం చేసుకోవడం గమనార్హం. మరో ప్రతిపక్ష పార్టీ లిబరల్‌ డెమోక్రటిక్‌ కూడా మెరుగైన స్థానాలను దక్కించుకుంది.ఫలితాల సరళిని చూస్తుంటే అధికార పార్టీ ఘోర పరాజయం దిశగా సాగుతున్నట్లే కన్పిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news