అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఇటీవల హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆయనకు ఉన్న ముప్పును అంచనా వేసే విషయంలో తాము కొంచెం అలసత్వం ప్రదర్శించినట్లు వచ్చిన ఆరోపణలపై సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ తాజాగా స్పందించింది. గత రెండేళ్లలో కొన్ని రకాల భద్రతా చర్యలు, వనరులను కేటాయించాలంటూ ట్రంప్ క్యాంప్ నుంచి వచ్చిన అభ్యర్థనలను తాము తిరస్కరించినట్లు ఆ సంస్థ ప్రతినిధి ఆంటోనీ గుగ్లెల్మీ తెలిపారు. వాటికి బదులు స్థానిక రక్షణ వనరులను ఆయనకు కేటాయించినట్లు వెల్లడించారు.
ట్రంప్‌పై జరిగిన దాడి తమ వైఫల్యం కాదని చెప్పేందుకు తొలుత ప్రయత్నించిన సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ నిందితుడు థామస్ మాథ్యూ క్రూక్స్ ఓ భవనం పైకప్పు మీదికి చేరుకుని తుపాకీ ఎక్కుపెట్టినా పోలీసులు పట్టించుకోలేదని మీడియాతో పేర్కొంది. ట్రంప్ రక్షణకు సంబంధించి తమ పరిధి దూరానికి మించి అది ఉందని, సమావేశం జరిగిన ప్రాంగణాన్ని పెట్రోలింగ్ చేయాల్సిన బాధ్యత స్థానిక పోలీసులదేనని సీక్రెట్ సర్వీస్ తెలిపింది.