కరోనా వైరస్‌తో జనజీవనం ఊర్తిగా అస్తవస్థం అయింది. ప్రజల జీవితాల్లో పెను మార్పులకు కారణం అయింది. సామాజికంగా , ఆర్థికంగానే గాక ఆరోగ్యం పరంగా అనేక సమస్యలకు కారణమైంది. ఈక్రమంలోనే కొవిడ్-19 వైరస్ సోకిన పురుషుల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయిలు తగ్గుతున్నట్టు టర్కీ పరిశోధకులు పేర్కొన్నారు. ఈ మేరకు వారిలో లైంగికవాంఛ కూడా తగ్గిపోతున్నట్లు చెప్పారు. టెస్టోస్టెరాన్ క్షీణిస్తే రోగనిరోధక శక్తి కూడా మందగిస్తుందని, దీంతో శ్వాస సంబంధిత సమస్యలు కూడా తలెత్తే అవకాశముందని టర్కీలోని మెర్సిన్ యూనివర్సిటీ శాస్త్రవేత్త సెలాహిటిన్ కాయన్ తెలిపారు.
కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న పురుషుల్లో టెస్టోస్టెరాన్ తగ్గుతున్నట్టు గుర్తించామన్నారు. ముఖ్యంగా లక్షణాలు లేని రోగులతో పోలిస్తే, ఐసీయూలో చికిత్స తీసుకుంటున్న కరోనా రోగుల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు. 438 మంది కరోనా రోగులపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడైనట్టు పేర్కొన్నారు. ‘శ్వాస సంబంధిత అవయవాల రోగనిరోధక శక్తికి, టెస్టోస్టెరాన్‌కు మధ్య సంబంధమున్నది. ఈ హార్మోన్ స్థాయిలు తగ్గితే, శ్వాస సంబంధిత సమస్యలు కూడా పెరుగుతాయి’ అని అన్నారు.