థాయ్‌లాండ్‌కు గొటబాయ రాజపక్స..!

దేశం విడిచి పారిపోయిన శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు తాత్కాలికంగా ఆశ్రయమిచ్చేందుకు థాయ్‌లాండ్‌ అంగీకరించింది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో దేశాన్ని నెట్టిన గొటబాయ.. ఆందోళనకారుల ప్రదర్శనలతో జులై 13న శ్రీలంక విడిచి మాల్దీవులకు.. అక్కడి నుంచి సింగపూర్‌కు తరలి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సింగపూర్‌ వీసా గడువు కూడా ముగియనుండడంతో తనకు  ఆశ్రయమివ్వమంటూ ఆయన థాయ్‌లాండ్‌కు విజ్ఞప్తి చేశారు.

‘‘మానవతా దృక్పథంతో తాత్కాలికంగా ఉండేందుకు మాత్రమే అవకాశం ఇస్తున్నాం. ఇక్కడ ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు నిర్వహించకూడదు’’ అని పేర్కొంటూ గొటబాయకు థాయ్‌లాండ్‌ ప్రధాని ప్రయూత్‌.. అనుమతి మంజూరు చేసినట్లు ‘బ్యాంకాక్‌ పోస్టు’ పత్రిక వెల్లడించింది.

శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స తన పదవికి రాజీనామా చేయాలని ఆందోళన చేస్తున్న తరుణంలోనే.. ఆయన దేశం విడిచి పారిపోయారు. ఆయన భార్య సహా ఇద్దరు బాడీగార్డ్స్​తో కలిసి వాయుసేన విమానంలో మాల్దీవుల రాజధాని మాలేకు పరారయ్యారనే వార్తలు అప్పట్లో చక్కర్లు కొట్టాయి. ఈ విషయాన్ని ప్రధానమంత్రి కార్యాలయం సైతం ధ్రువీకరించింది. మాల్దీవుల నుంచి సింగపూర్ వెళ్లిన గొటబాయ.. తన వీసా గడువు ముగియనుండటం వల్ల థాయ్ లాండ్ కు వెళ్లనున్నట్లు ఆ దేశ వార్తా పత్రకి ఒకటి వెల్లడించింది.