ఎటుచూసినా ఆర్తనాదాలు.. భవన శిథిలాల గుట్టలు.. వాటికింద క్షతగాత్రుల రోదనలు.. క్షణక్షణం భయపెడుతూ భూప్రకంపనలు.. ఎముకలు కొరికే చలి.. ప్రపంచంతో తెగిపోయిన సంబంధాలు.. ఇదీ టర్కీ, సిరియా దేశాల్లో ప్రస్తుత దుస్థితి. రెండ్రోజుల నుంచి ఈ దేశాల్లో భూకంపాలు సంభవిస్తూ వేలాది మంది ప్రాణాలు పొట్టనపెట్టుకుంటున్నాయి.
ఈ భూకంపం సృష్టించిన విధ్వంసం వల్ల రెండు దేశాల్లో ఇప్పటికే 7,700 మంది మరణించారు. భవన శిథిలాల కింద వేలాది మంది చిక్కుకున్నారు. శిథిలాల తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. ఈ ప్రకృతి విపత్తుతో ప్రాణనష్టం 20వేలకు పైగానే ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
పెను విషాదం అలముకున్న రెండు దేశాలకు సాయపడేందుకు ప్రపంచ దేశాలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నాయి. వేలసంఖ్యలో నేలమట్టమైన భవంతుల్లో సజీవంగా ఎవరైనా ఉన్నారేమో తెలుసుకునేందుకు కాలంతో పోటీపడి సహాయక బలగాలు ప్రయత్నిస్తున్నాయి. ఒక్క టర్కీలోనే 6,000 భవనాలు కూలిపోయాయి. సహాయక చర్యల కోసం 25,000 మంది రంగంలోకి దిగినా ఏమూలకూ సరిపోవడం లేదు.