రష్యా సైన్యం తమ అధ్యక్ష భవనంపై దాడి చేస్తే బందీగా లొంగిపోవడం తలవంపుగా భావిస్తానని ఉక్రెయిన్ అధ్యక్షుడు అన్నారు. వారి చేతిలో బందీ అవడం కంటే సహచరులతో కలిసి తాను కూడా ప్రాణాలకు తెగించి పోరాడతానని తెలిపారు.
సైనికచర్య పేరుతో ఏడాది కిందట రష్యా మొదలుపెట్టిన దురాక్రమణతో ఉక్రెయిన్ మొత్తం ఇప్పటికే నాశనమైంది. వేల మంది ప్రాణాలు కోల్పోవడంతోపాటు కొన్ని నగరాలు, పట్టణాలు నామరూపాల్లేకుండా పోయాయి. అయినప్పటికీ, ఉక్రెయిన్ మాత్రం ఏడాది కాలంగా తన ప్రతిఘటనను కొనసాగిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మొదలైననాటి పరిస్థితులను గుర్తుచేసుకొన్న జెలెన్‌స్కీ.. అప్పట్లో తాను తుపాకీ పెట్టుకొని తిరిగానన్నారు. ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
‘‘మా అధ్యక్ష కార్యాలయంలోకి శత్రుమూకలు ప్రవేశిస్తే.. నేడు మేము ఇక్కడ ఉండేవాళ్లం కాదు. బాంకోవా స్ట్రీట్ వద్ద కట్టుదిట్టమైన ప్రతిఘటన బలగాలు ఉండటం వల్ల ఒక్కరు కూడా ఖైదీలుగా మారలేదు. ‘ఉక్రెయిన్ అధ్యక్షుడు రష్యా చేతిలో బందీగా మారాడు’ అనే శీర్షికను మీరు ఊహించగలరా? ఇది చాలా అవమానకరం.. దాన్ని తలవంపుగా భావిస్తా’ అని జెలెన్‌స్కీ అన్నారు.