కరోనాతో ఐదేళ్లు వెనక్కి వెళ్లిన అభివృద్ధి.. ఐరాస నివేదిక

-

కొవిడ్ సృష్టించిన విలయంతో ప్రపంచ దేశాలు వణికిపోయాయి. చాలా దేశాల ఆర్థికస్థితి గతి తప్పింది. ఎన్నో లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. మరెన్నో లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇప్పుడిప్పుడే కొవిడ్ మహమ్మారి నుంచి కొన్ని దేశాలు కోలుకుంటుండగా.. మరికొన్ని దేశాలు మాత్రం ఇంకా లాక్‌డౌన్ ఆంక్షల్లో కొనసాగుతూనే ఉన్నాయి. గత రెండేళ్లుగా కరోనా వైరస్‌ మహమ్మారి ప్రభావంతో ప్రపంచ మానవాభివృద్ధి ఐదేళ్లు వెనక్కి వెళ్లినట్లు ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (UNDP) వెల్లడించింది. ప్రపంచంలో ‘అనిశ్చిత సమయాలు, అస్థిరమైన జీవితాలు’  అనే పేరుతో తాజా నివేదిక విడుదల చేసింది.

 

కరోనా మహమ్మారి విజృంభణ కారణంగా మానవాభివృద్ధి సూచిక వరుసగా రెండేళ్లు (2020, 2021 ఏడాది) క్షీణించిపోయిందని యూఎన్‌డీపీ నివేదిక పేర్కొంది. ముఖ్యంగా ఆయా దేశాల్లో ఆయుర్దాయం, విద్యా స్థాయిలు, జీవన ప్రమాణాలు గణనీయంగా పడిపోయాని వెల్లడించింది. ప్రపంచ ఆయుర్దాయం 2019లో 73ఏళ్లుగా ఉండగా.. అది 2021నాటికి 71.4కు పడిపోయిందని తెలిపింది. యూఎన్‌డీపీ ఏర్పడిన గత 30ఏళ్లలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడడం ఇదే తొలిసారి అని ఆ సంస్థ అభిప్రాయపడింది.

మానవాభివృద్ధి క్షీణించడం అంటే మన ఆయుర్దాయం తగ్గడం, ఉన్నతమైన విద్యను కోల్పోవడం, మన ఆదాయాలు తగ్గిపోవడమేనని యూఎన్‌డీపీ చీఫ్‌ ఆచిమ్‌ స్టైనర్‌ అభిప్రాయపడ్డారు. గతంతో ఎన్నో విపత్తులను, ఎన్నో సంక్షోభాలను ప్రపంచం చూసినా ప్రస్తుతం ఎదుర్కొంటోన్న పరిస్థితులు మాత్రం మానవాభివృద్ధికి అతిపెద్ద ఎదురుదెబ్బ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 90శాతం దేశాలు ఈ గడ్డు పరిస్థితులను చవిచూస్తున్నాయన్నారు.

ఈ సంక్షోభాలను కొన్ని దేశాలు సమర్థంగా ఎదుర్కొంటున్నా లాటిన్‌ అమెరికా, ఆఫ్రికా, దక్షిణాసియా, కరేబియన్‌ ప్రాంతాల్లోని కొన్ని దేశాలు ఇంకా కోలుకోలేక పోతున్నాయన్నారు. ఇదే సమయంలో ఉక్రెయిన్‌పై రష్యా దాడి ఘటన ప్రపంచవ్యాప్తంగా ఆహార, ఇంధన సంక్షోభాలను మరింత ముదిరేలా చేశాయని నివేదిక పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news