జూనియర్ ఎన్టీఆర్ తో కేంద్ర హోం మంత్రి అమిత్ షా భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ భేటీ వెనక ఉన్న ప్రాధాన్యత ఏంటి? ఇది కేవలం సినిమాలకే పరిమితమా? లేక రాజకీయ ప్రమేయం ఏదైనా ఉందా? అన్న చర్చ సర్వత్ర జోరుగా నడుస్తోంది. ఇంతకీ ఇద్దరి మధ్య ఏం జరిగి ఉంటుంది? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఇటు తెలుగు సినీ వర్గాల్లో, అటు పొలిటికల్ వర్గాల్లో వీరి భేటీ పైనే సర్వత్రా చర్చ.
ఇంతకీ జూనియర్ ఎన్టీఆర్ – అమిత్ షా భేటీ వెనక దాగిన రహస్యం ఏంటనే విషయాన్ని తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ క్లారిటీ ఇచ్చారు. ” అమిత్ షా ఎన్టీఆర్ ను కలవడంపై కొందరు టిడిపికి చెక్ పెట్టడానికి అనుకుంటున్నారు. మరికొందరు సంది కుదుర్చుకోవడానికి అంటున్నారు. ఈ రెండు కూడా తప్పే. ఆర్.ఆర్.ఆర్ సినిమా చూసినప్పుడు అమిత్ షా గారు ఎన్టీఆర్ తో ఫోన్ చేసి కూడా మాట్లాడారు.
ఈ క్రమంలోనే అమిత్ షా తెలంగాణకు వచ్చినప్పుడు ఆయన గుర్తుకు వచ్చి వెంటనే ఫోన్ చేసి కలిసారు. సినిమా పరంగానే చర్చ జరిగింది తప్ప.. మరే చర్చ జరగలేదు. భేటీ సమయంలో నేను కూడా అక్కడే ఉన్నాను. సీనియర్ ఎన్టీఆర్ గురించి, వారి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడారు”. అని క్లారిటీ ఇచ్చారు బండి సంజయ్.