ఐదేళ్ల తర్వాత అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ చైనాలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన బీజింగ్ చేరుకున్నారు. పలు అంశాలపై రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను చల్లార్చడమే లక్ష్యంగా ఆయన దౌత్య చర్చలను సాగించనున్నట్లు సమాచారం. తొలుత ఆయన చైనా విదేశాంగ మంత్రి క్విన్ గాంగ్‌తో సమావేశమయ్యారు. విదేశాంగ శాఖలో ఉన్నతాధికారి వాంగ్ యీతో భేటీ అవుతారు. అధ్యక్షుడు జిన్‌పింగ్‌తోనూ సమావేశమయ్యే అవకాశం ఉంది.
వాస్తవానికి గతంలోనే ఈ పర్యటన జరగాల్సి ఉండగా.. చైనా నిఘా బెలూన్ ఘటనతో నిలిచిపోయింది. ఈ పర్యటన వల్ల దౌత్య సంబంధాలు ఇప్పటికిప్పుడు సాధారణ స్థాయికి చేరే అవకాశాలు తక్కువేనని విశ్లేషకులు చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా ఇరు దేశాల మధ్య వైరం తీవ్రం కావడమే ఇందుకు కారణమని పేర్కొంటున్నారు. ‘‘చైనాతో ఉన్న పోటీని వివాదంగా మార్చదల్చుకోలేదు’’ అని బ్లింకెన్ పేర్కొన్నారు. అపార్థాలకు తావు లేకుండా చూడటానికి ఇరు దేశాల నేతల మధ్య కమ్యూనికేషన్లను మెరుగుపరచుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు.