నేను అధికారంలోకి వస్తే.. ‘లాటరీ’ విధానానికి గుడ్‌బై : వివేక్ రామస్వామి

-

రిపబ్లికన్‌ తరఫున అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్థిత్వానికి పోటీ పడుతోన్న భారత సంతతి వ్యక్తి వివేక్‌ రామస్వామి ఆ దేశ ప్రజలను ఆకర్షించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. తన ప్రసంగాలతో.. కీలక హామీలతో ప్రజలను తనవైపు తిప్పుకుంటున్నారు. ముఖ్యంగా వివేక్ ప్రసంగాలకు అక్కడి జనం ఫిదా అవుతున్నారు. మరోవైపు పలువురు ప్రముఖులు కూడా రామస్వామికి మద్దతు పలుకుతున్నారు.

తాజాగా వివేక్ రామస్వామి మరికొన్ని కీలక హామీలు ప్రకటించారు. తాను అధికారంలోకి వస్తే లాటరీ ఆధారిత హెచ్‌-1బీ వీసా ప్రక్రియకు స్వస్తిచెబుతానని సంచలన ప్రకటన చేశారు. దాని స్థానంలో ప్రతిభ ఆధారిత విధానాన్ని తెస్తానని పేర్కొన్నారు. ‘ప్రస్తుతం లాటరీ విధానంలో ఉన్న వీసా (H-1B) ప్రక్రియను మెరిట్‌ ఆధారిత వ్యవస్థలోకి మార్చాల్సిన అవసరం ఉందని రామస్వామి అభిప్రాయపడ్డారు. ప్రస్తుత విధానం స్పాన్సర్‌ చేసే సదరు కంపెనీకే ప్రయోజనం కలిగించేదిగా ఉందని.. ఇది ఒప్పంద సేవ వంటిదని.. దానికి తాను స్వస్తి పలుకుతానని వివేక్‌ రామస్వామి పేర్కొన్నారు.

అంతేకాకుండా గొలుసు ఆధారిత వలసలను నిర్మూలించాల్సిన అవసరం అమెరికాకు ఉందని రామస్వామి చెప్పినట్లు అక్కడి మీడియా పేర్కొంది. మరోవైపు ఇటీవలే 75శాతం ఉద్యోగులను తొలగించడంతోపాటు ఎఫ్‌బీఐని మూసివేస్తానని ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news