స్మార్ట్ ఫోన్లకు చార్జింగ్ పెట్టి ఉండగా వాటితో మాట్లాడుతూ కరెంటు షాక్‌కు గురై గతంలో కొందరు చనిపోయారు. అయితే రష్యాలోనూ సరిగ్గా ఇలాంటిదే ఓ సంఘటన చోటు చేసుకుంది. ఓ యువతి బాత్ టబ్‌లో స్నానం చేస్తుండగా.. పక్కనే చార్జింగ్ పెట్టి ఉన్న ఐఫోన్ అందులో పడింది. దీంతో కరెంటు షాక్‌కు గురై ఆ యువతి మృతి చెందింది.
రష్యాలోని ఆర్కేంజల్‌స్క్ అనే సిటీలో నివాసం ఉండే ఒలెస్యా సెమెనోవా (24) బాత్ టబ్‌లో స్నానం చేస్తోంది. కాగా పక్కనే చార్జింగ్ పెట్టి ఉన్న ఆమె ఐఫోన్ కేబుల్‌తో సహా అందులో పడింది. దీంతో ఒక్కసారిగా విద్యుత్ షాక్ వచ్చింది. దాని బారిన పడి ఆమె చనిపోయింది. కొంత సేపటికి ఆమె స్నేహితురాలు డారియా ఆమెను చూసేందుకు వచ్చి బాత్‌రూంలో పడి ఉన్న ఆమె మృతదేహాన్ని చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని సంఘటన ఎలా జరిగిందనే విషయాన్ని పరిశీలించారు.
సెమెనోవా ఐఫోన్ చార్జింగ్ పెట్టి ఉందని, అది బాత్ టబ్‌లో పడి విద్యుత్ షాక్ రావడం వల్లే ఆమె చనిపోయిందని వైద్యులు నిర్దారించారు. ఈ క్రమంలో రష్యా ఎమర్జెన్సీస్ మంత్రిత్వ శాఖ అక్కడి పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని సూచించింది.