ప్రఖ్యాత తెలుగు దర్శకుడు, నటుడు, నిర్మాత, వ్యాపారవేత్త అయిన ఎల్వీ ప్రసాద్ సినీ పరిశ్రమకు చేసిన సేవల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విశ్వ విఖ్యాత నటసార్వభౌమ, నటరత్న ..నందమూరి తారక రామారావు( సీనియర్ ఎన్టీఆర్)ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకుడు ఎల్వీ ప్రసాద్. ఆయన జీవితం ప్రతీ ఒక్కరికి స్ఫూర్తి దాయకం. థియేటర్ ముందర గేట్ కీపర్ గా పని చేసిన ఎల్వీ ప్రసాద్.. ఆ తర్వాత కాలంలో ఐ మ్యాక్స్ అధినేత అయ్యారు. ఆయన జీవిత విశేషాలు తెలుసుకుందాం.
సినిమా అవకాశాల కోసం ముంబైలో అష్ట కష్టాలు పడ్డ ఎల్వీ ప్రసాద్.. ఆ తర్వాత ప్రఖ్యాత సీని దర్శకుడయ్యారు. త్రిపురనేని గోపిచంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గృహ ప్రవేశం’ పిక్చర్ కు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన ఎల్వీ ప్రసాద్..అనుకోని కారణాల వలన ఆ సినిమాకు పూర్తి స్థాయి దర్శకుడు, హీరోగా పని చేయాల్సి వచ్చింది. అలా వచ్చిన ఆ మూవీ సూపర్ హిట్ అయింది.
ఇక ఆ తర్వాత ఎల్వీ ప్రసాద్ కు వరుస అవకాశాలు వచ్చాయి. ‘పల్నాటి యుద్ధం’, ‘ద్రోహి’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆ చిత్రాలు కూడా ఘన విజయం సాధించాయి. అలా ఆ క్రమంలోనే సీనియర్ ఎన్టీఆర్ ను ‘మనదేశం’ ఫిల్మ్ తో తెలుగు వెండితెరకు పరిచయం చేశారు. ఇక ఆ తర్వాత ‘సంసారం’, ‘మిస్సమ్మ’, ‘షావుకారు’ వంటి చిత్రాలు చేసి ఘన విజయాలు అందుకున్నారు.
తొలి హిందీ టాకీ ‘ఆలంఆరా’, తొలి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’, తొలి తమిళ్ టాకీ ‘కాళిదాస్’లో ఎల్వీ ప్రసాద్ నటించడం విశేషం. ఆయన సేవలకు గాను ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇచ్చింది. అలా ఎల్వీ ప్రసాద్ తన జీవితంలో ఎన్నో విజయాలు అందుకున్నారు. చిన్న చిన్న పాత్రల కోసం కాళ్లరిగేలా ముంబైలో తిరిగిన ఎల్వీ ప్రసాద్.. ఆ తర్వాత కాలంలో తనే దర్శకుడిగా పలు సినిమాలు చేయడంతో పాటు నటించారు కూడా.