సంచైత రాజకీయం పై ఉత్తరాంధ్ర లో ఆసక్తికర చర్చ

-

సంచైత గజపతిరాజు ఉత్తరాంధ్ర రాజకీయాలలో ఓ సంచలనం. వేల ఎకరాలు, అనేక విద్యాసంస్థలు, 105 దేవస్థానాలు కలిగిన మాన్సాస్ ట్రస్ట్‌తోపాటు ప్రఖ్యాత సింహాచలం దేవస్థానానికి ఆమే చైర్మన్‌. ఏపీలో అతి చిన్న వయస్సులో ప్రముఖ దేవస్థానానికి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మహిళ కూడా. జిల్లా రాజకీయాల్లో మాత్రం ఆమె హాట్ టాపిక్‌ గా ఉన్నా ఏ పార్టీలో ఉన్నారో తెలియదు. సంచైత రాజకీయం పై ఉత్తరాంధ్రలో ఆసక్తికర చర్చ జరుగుతుందట…

పూసపాటి గజపతిరాజుల వారసురాలునని.. ఆనంద గజపతిరాజు కుమార్తెనని చెబుతూ రాటుదేలిన రాజకీయ వేత్తగా ఎత్తులు వేస్తున్నారు సంచైతగజపతిరాజు . బాబాయ్‌ అశోక్‌గజపతిరాజును లక్ష్యంగా చేసుకుని సోషల్‌ మీడియాలో బాణాలు ఎక్కుపెడుతున్నారు. టీడీపీ నేతలను వదలడం లేదు. ఒక రకంగా చెప్పాలంటే రాజకుటుంబానికి కంటిపై కనుకు లేకుండా చేస్తున్నారు సంచైత. సంచైతా మాన్సాస్ భద్యతలు చెపట్టే వరకు ఎప్పుడోగాని విజయనగరం ముఖమే చూడలేదు.

జిల్లాకు దూరంగా ఉంటూ బీజేపీలో చేరి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్నారామె. అలాంటి సంచైత రాత్రికి రాత్రి మాన్సాస్‌ ట్రస్ట్‌ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టడంతో కమలనాథులే షాక్‌ అయ్యారని చెబుతారు. వైసీపీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి ఇంటికి వచ్చి అక్కడి నుంచి వైసీపీ నేతలతో కలిసి వెళ్లి మాన్సాస్‌ ట్రస్ట్‌ బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలోనే సంచైతను బీజేపీ నుంచి సస్పెండ్‌ చేశామన్నది కమలనాథులు చెప్పేమాట. మరి సస్పెన్షన్ పై క్లారిటీ కూడా లేదంటున్నది ఆపార్టీ వారే.ఆమె బీజేపీ నాయకురాలా.. వైసీపీ ప్రతినిధా అన్నది ఎవరూ చెప్పలేరు.

మాన్సాస్ ట్రస్ట్‌ చైర్మన్‌ హోదాలో అశోక్‌ను, చంద్రబాబును ఇతర టీడీపీ నేతలపై పదునైన విమర్శల విమర్శలతో తరచు విరుచుకుపడతారు సంచైత. ఇటీవల ఎన్టీఆర్‌ వర్థంతి సందర్భంగా అదే చేశారామె. ఆమె ఉపయోగించే పదజాలం పరిశీలిస్తే.. అచ్చు వైసీపీ నాయకురాలిగా ఉంటారని కొందరు చెబుతారు. వైసీపీ ఆశీస్సులతోనే మాన్సాస్‌ పగ్గాలు చేపట్టారు కాబట్టి.. ఆమెను అధికార పార్టీ నాయకురాలిగానే చూడాలని మరికొందరి అభిప్రాయం. పార్టీ కండువా కప్పుకోకుండానే ఆమె ఫక్తు వైసీపీ నేతగా మారినట్టు చెబుతారు.

ఇంత వరకు బాగానే ఉన్నా.. మహారాజా కాలేజీ, మాన్సాస్‌ ట్రస్ట్‌ కార్యాలయం తరలింపు.. అయోధ్య మైదానంలోకి బయట వ్యక్తులకు అనుమతి నిరాకరణ.. జూనియర్‌ కాలేజీల మూసివేతపై సంచైత తీసుకున్న నిర్ణయాలు స్థానిక వైసీపీ నేతలకు రుచించలేదు. ఈ అంశాలను స్థానిక నేతలు పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా ఆమె దూకుడు తగ్గలేదు. దీంతో వైసీపీ పెద్దల ఆశీసులతోనే ఆమె ఈ నిర్ణయం తీసుకుంటున్నారా అన్న అనుమానాలు ఉన్నాయట. అలా అని ఓపెన్‌గా వైసీపీ కార్యకలాపాలలో కనిపించింది లేదు.

రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాలతో సడెన్‌ ఎంట్రీ ఇచ్చి కలకలం రేపుతున్నారు. అందుకే ఆమె బీజేపీనా.. వైసీపీనా అన్నదానిపై ఈ మధ్య చర్చ కూడా ఉత్తరాంధ్రలో మొదలైంది.

Read more RELATED
Recommended to you

Latest news