ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా నిర్వహిస్తున్న డిప్లొమాటిక్ అవుట్ రీచ్ అవగాహన సదస్సు ఇవాళ ప్రారంభమైంది. ఇందులో 35 దేశాలకు చెందిన ప్రతినిధులు, దౌత్య వేత్తలు హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా నిర్వహిస్తున్న డిప్లొమాటిక్ అవుట్ రీచ్ అవగాహన సదస్సు ఇవాళ ప్రారంభమైంది. ఇందులో 35 దేశాలకు చెందిన ప్రతినిధులు, దౌత్య వేత్తలు హాజరయ్యారు. కేంద్ర విదేశాంగ శాఖ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా.. ఇందులో పాల్గొన్న ఏపీ సీఎం జగన్ మాట్లాడుతూ.. ఏపీలో అవినీతి రహిత పాలనకే తమ మొదటి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఏపీలో కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని జగన్ తెలిపారు.
ఏపీలో సుస్థిరమైన ప్రభుత్వం ఉందని, కంపెనీలు పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తున్నామని జగన్ అన్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మెట్రో నగరాలు ఏపీలో లేకున్నా ఇక్కడ అమోఘమైన తీరప్రాంతం ఉందని, అదే కంపెనీలకు ముఖ్యమైన వనరుగా ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నామని అన్నారు. ఢిల్లీ తరువాత ఇంత మంది దౌత్యవేత్తలతో సమావేశమవడం మళ్లీ ఇదే తొలిసారని జగన్ వ్యాఖ్యానించారు.
కాగా విద్యుత్ ఒప్పందాలపై సమీక్ష చేయాలని నిర్ణయం తీసుకున్నామని, అయితే ఇది వివాదస్పదమైన నిర్ణయమని అందరూ అనుకుంటున్నారు.. కానీ విద్యుత్ పంపిణీ సంస్థలను రక్షించాలంటే ఇలా చేయడం అనివార్యమని జగన్ అన్నారు. ప్రజలు, విద్యుత్ పంపిణీ సంస్థలు, ప్రభుత్వం నష్టపోకుండా ఉండేందుకే సమీక్ష నిర్ణయాలను తీసుకున్నామని జగన్ వివరించారు. ఏపీలో ఏర్పాటు చేసే పరిశ్రమల్లో ఉద్యోగాలను స్థానిక ఇంజినీరింగ్ యువకులకే ఎక్కువగా ఇవ్వాలని, అందుకు గాను అవసరం అయితే యువతకు ఉద్యోగానికి కావల్సిన నైపుణ్యాలలో శిక్షణ ఇప్పిస్తామని జగన్ స్పష్టం చేశారు.