మన చేతుల్లో ఉండే స్మార్ట్ ఫోన్ అకస్మాత్తుగా జారి కింద పడితే.. అది పగిలితే మనకు ఎంత బాధగా అనిపిస్తుందో అందరికీ తెలుసు. ఫోన్‌కు ఏమీ కాకపోతే హమ్మయ్య అనుకుంటాం. అదే ఫోన్ పగిలితే దాని రిపేర్‌కు మళ్లీ అనవసరంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆ వ్యక్తి కూడా సరిగ్గా అలాగే అనుకున్నాడు. 2వేల అడుగుల ఎత్తు నుంచి అతని చేతుల్లోంచి జారిన ఐఫోన్ కింద పడింది. ఫోన్ పగిలిందనే అనుకున్నాడు. కానీ అసలు దానికి ఏమీ కాలేదు. ఈ సంఘటన బ్రెజిల్‌లో చోటు చేసుకుంది.
బ్రెజిల్‌లోని రియో డి జెనెరియోకు చెందిన ఎర్నెస్టో గాలియొటొ 2వేల అడుగుల ఎత్తులో ఓ చిన్నపాటి విమానంలో డాక్యుమెంటరీ తీస్తున్నాడు. అదే సమయంలో తన ఐఫోన్ 6ఎస్ ఫోన్ ద్వారా ప్లేన్ నుంచి వీడియో తీస్తున్నాడు. అయితే బలంగా వీచిన గాలికి అతని చేతుల్లో ఉన్న ఐఫోన్ 6ఎస్ ఫోన్ కిందపడింది. దీంతో ఫోన్ తుక్కుగా పగిలి ఉంటుందని అతను అనుకున్నాడు. కానీ అలా జరగలేదు.
విమానం నుంచి ఫోన్ కింద పడగానే ఎర్నోస్టో ఫైండ్ మై ఐఫోన్ ద్వారా తన ఐఫోన్ ఎక్కడ పడిందో గుర్తించాడు. అయితే ఫోన్‌ను చూసిన అతనికి ఆశ్చర్యం వేసింది. 2వేల అడుగుల ఎత్తు నుంచి కింద పడినా ఫోన్ స్క్రీన్ గార్డ్ పగిలింది కానీ.. ఫోన్‌కు అసలు చిన్న పగులు కూడా ఏర్పడలేదు. దీంతో అక్కడ ఉన్న వారందరూ షాకయ్యారు. కాగా ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.