బ‌యో-సెక్యూర్ బ‌బుల్ వాతావ‌ర‌ణంలో ఐపీఎల్‌.. అంటే ఏమిటంటే..?

-

ఇటీవ‌లే ముగిసిన ఇంగ్లండ్‌, వెస్టిండీస్ టెస్ట్ సిరీస్‌ను పూర్తిగా బ‌యో-సెక్యూర్ బ‌బుల్ వాతావ‌ర‌ణంలో నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. మొత్తం 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలో బ‌యో-సెక్యూర్ బ‌బుల్ ప‌ద్ధ‌తి ప‌నిచేయ‌డంతో ఇటు బీసీసీఐ కూడా స‌రిగ్గా ఇదే ప‌ద్ద‌తిలో దుబాయ్‌లో ఐపీఎల్‌ను నిర్వ‌హించాల‌ని చూస్తోంది. అందుకు అనుగుణంగానే స్టాండ‌ర్డ్ ఆప‌రేటింగ్ ప్రొసీజ‌ర్ (ఎస్‌వోపీ)ని సిద్ధం చేస్తోంది. ఆగ‌స్టు 2న జ‌ర‌గ‌నున్న స‌మావేశంలో ఐపీఎల్ యాజమాన్యం స‌ద‌రు ఎస్‌వోపీని ఫ్రాంచైజీల‌కు ఇవ్వ‌నుంది.

ipl to be held in bio secure bubble environment what is it

బ‌యో సెక్యూర్ బ‌బుల్ అంటే.. క్రికెట్ ఆడే ప్లేయ‌ర్ల‌కు బ‌య‌టి ప్ర‌పంచంతో పూర్తిగా సంబంధాల‌ను క‌ట్ చేస్తారు. అంటే వారు మ్యాచ్‌లు ఆడే స్టేడియంలు, బ‌స చేసే హోట‌ళ్ల‌కు మాత్ర‌మే వారికి అనుమ‌తి ఉంటుంది. ఇక ఎక్క‌డికీ వారు వెళ్ల‌రాదు. మ్యాచ్‌తో సంబంధం లేని వారిని క‌ల‌వ‌రాదు. స్నేహితులు, తెలిసిన వారు, ఫ్యాన్స్‌, కుటుంబ స‌భ్యుల‌ను కూడా వారు మ్యాచ్‌లు జ‌రిగిన‌న్ని రోజులు క‌ల‌వ‌రాదు. క‌లిస్తే 5 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచుతారు. అనంత‌రం ఫైన్ వేసి తిరిగి మ్యాచ్‌ల‌లోకి అనుమ‌తిస్తారు.

అయితే ఐపీఎల్ 51 రోజుల పాటు జ‌రుగుతుంది క‌నుక అన్ని రోజుల పాటు క్రికెటర్లు త‌మ కుటుంబ స‌భ్యుల‌కు దూరంగా ఉండ‌డం క‌ష్ట‌మ‌ని భావిస్తున్నారు. అందుక‌నే కుటుంబ స‌భ్యుల‌ను ప్లేయ‌ర్ల‌తో ఉండేలా ఐపీఎల్ యాజ‌మాన్యం అనుమ‌తిస్తుంద‌ని తెలుస్తోంది. కానీ ఆ నిర్ణ‌యాన్ని ఫ్రాంచైజీల‌కే వ‌దిలేస్తుంద‌ని తెలుస్తోంది.

ఇక బ‌యో సెక్యూర్ బ‌బుల్ కింద‌కు ప్లేయ‌ర్లు మాత్ర‌మే కాకుండా.. మ్యాచ్ నిర్వ‌హించే సిబ్బంది, బ్రాడ్‌కాస్టింగ్ సిబ్బంది, అంపైర్లు, స్టేడియం సిబ్బంది, ప్లేయ‌ర్ల బృందంలో ఉండే వైద్యులు, ఇత‌ర స‌హాయ‌క సిబ్బంది కూడా వ‌స్తారు. అందుక‌ని వారంద‌రూ బ‌యో సెక్యూర్ బ‌బుల్‌లో ఉండాలి.

అలాగే మ్యాచ్‌ల సంద‌ర్భంగా ప్లేయ‌ర్లు గ‌తంలో మాదిరిగా త‌మ క్యాప్‌లు, హెల్మెట్లు, స్వెట‌ర్లు, ఇత‌ర వ‌స్తువుల‌ను అంపైర్ల‌కు ఇవ్వ‌రాదు. ఇంగ్లండ్, వెస్టిండీస్ సిరీస్‌లోనూ స‌రిగ్గా ఇదే మెయింటెయిన్ చేశారు. ఇంగ్లండ్ ఫాస్ట్ బౌల‌ర్ జోఫ్రా ఆర్చ‌ర్ నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఓ స్నేహితున్ని క‌లిశాడ‌ని అత‌న్ని 5 రోజుల పాటు క్వారంటైన్ చేశారు. త‌రువాత జ‌రిమానా విధించి మ‌ళ్లీ మ్యాచ్‌లు ఆడేందుకు అనుమ‌తిచ్చారు. ఈ క్ర‌మంలో క‌రోనా భ‌యం లేకుండా స‌ద‌రు టెస్ట్ సిరీస్‌ను ఇంగ్లండ్‌లో విజ‌య‌వంతంగా నిర్వ‌హించారు. క‌నుక‌నే అదే ప‌ద్ధ‌తిలో బీసీసీఐ కూడా త్వ‌ర‌లో ఐపీఎల్‌ను నిర్వ‌హించాల‌ని చూస్తోంది. ఇక ఆగ‌స్టు 2న ఫ్రాంచైజీల‌కు ఇచ్చే ఎస్‌వోపీ వివ‌రాల్లో అన్ని విష‌యాలూ తెలుస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news