ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మరోసారి ఫిక్సింగ్ అంశం దుమారం రేపుతోంది. ఆదివారం ఢిల్లీ, ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఫిక్సయిందంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఆ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ ముందుగా బ్యాటింగ్ చేపట్టి 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. అనంతరం ముంబై ఆ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది.
అయితే ఢిల్లీ తమ ఇన్నింగ్స్ ముగిసే సరికి 5 వికెట్లకు 163 పరుగులు చేస్తుందని ముంబై ఇండియన్స్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేసింది. కానీ యాదృచ్ఛికమో, మరే విషయమో తెలియదు కానీ.. ముంబై ఇండియన్స్ చేసిన ట్వీట్‌కు అనుగుణంగానే ఢిల్లీ 20 ఓవర్లలో 4 వికెట్లకు 162 పరుగులు చేసింది. దీంతో ఇన్నింగ్స్ ముగియకుండానే ముంబై ఫ్రాంచైజీ అంత కచ్చితంగా స్కోరును ముందుగానే ఎలా ఊహిస్తుంది, కచ్చితంగా ఇందులో ఏదో తేడా ఉంది, ఫిక్సింగ్ జరిగే ఉంటుంది.. అని అభిమానులు మండిపడుతున్నారు.
కాగా ముంబై ఇండియన్స్ చేసిన ఆ ట్వీట్‌ను తరువాత డిలీట్ చేసింది. కానీ దాన్ని అప్పటికే ఫ్యాన్స్ స్క్రీన్ షాట్లతో సేవ్ చేసి పెట్టారు. దీంతో ముంబై ఇండియన్స్‌ను ఇప్పుడు నెటిజన్లు ఆట ఆడుకుంటున్నారు. ఐపీఎల్ 2020 మొత్తం ఫిక్సయిందని, ముంబై జట్టే మళ్లీ గెలుస్తుందని.. నెటిజన్లు ఆరోపిస్తున్నారు. మరి దీనిపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్, బీసీసీఐ ఎలా స్పందిస్తాయో చూడాలి.