ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరించే వ్యవహారశైలిపై విమర్శలు పెరుగుతున్నాయి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో సానుకూలంగా ఉండటం, లేదా ఆయన విషయంలో సఖ్యతగా ఉండటం అనేది పక్కన పెడితే, ఆయన విషయంలో ఏ జోక్యం చేసుకోకుండా ఉండటమే మేలు. రాజకీయంగా సిఎం జగన్ వచ్చే కష్టాలు ఏమీ లేవు. కాని నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో జోక్యం చేసుకుంటే కొరివితో తల గోక్కున్నట్టే అనేది చాలా మంది మాట.
ఇక్కడ నిమ్మగడ్డ గురించి గొప్ప చెప్పడమో లేక మరొకటి కాదు… నిమ్మగడ్డ ఇప్పుడు ఎస్ఈసి గా ఉన్నారు. ఆయన విషయంలో కక్ష సాధింపుగా వెళ్తే ఇప్పటి వరకు జరిగిన ఏకగ్రీవాలను రద్దు చేసి, ఎన్నికల ప్రక్రియ మళ్ళీ మొదటి నుంచి నిర్వహించే అవకాశం లేకపోలేదు. ఎలాగూ వాయిదా వేసి ఆరు నెలలు అయింది కనుక నిర్వహించినా ఆశ్చర్యం లేదు. కాబట్టి ఆయన విషయంలో ఏ జోక్యం లేకుండా ముందుకు వెళ్ళడం మంచిది. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పవచ్చు… రాజ్యాంగ బద్ధ పదవుల్లో ఉన్న వారి గురించి…
శాసన మండలిలో రాజధాని బిల్లులు రెండు ప్రవేశ పెట్టిన సమయంలో మంత్రి బొత్సా సత్యనారాయణ, అనీల్ కుమార్ మండలి చైర్మన్ ని కాస్త దూకుడుగా విమర్శించారు. ఆయనపై వ్యక్తిగత దూషణలు కూడా చేసారట. దీనితో ఆయన సైలెంట్ గా బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ కోపాన్ని ఆయన సౌమ్యంగా ప్రదర్శించారట. ఇప్పుడు నిమ్మగడ్డ కూడా అలానే చేసే అవకాశం ఉండవచ్చు. ఇప్పుడు హైకోర్ట్ వెళ్లి మా సిబ్బంది మీద కేసులు పెడుతున్నారని ఆయన పిటీషన్ వేసారు.
అంటే భవిష్యత్తులో నిమ్మగడ్డ ఆన్లైన్ లో నామినేషన్ ప్రక్రియ చేపట్టినా, ఏకగ్రీవాలు రద్దు చేసినా కనపడకుండా నష్టపోయేది అధికార పార్టీనే. ఎన్నికల కోసం చాలా కష్టపడ్డారు, ఆర్ధికంగా చాలా ఖర్చు చేసారు. కాబట్టి నిమ్మగడ్డ విషయంలో కక్ష సాధింపు అనేది లేకుండా ముందుకు వెళ్ళాలి. అనవసరంగా అతి జోక్యత ప్రభుత్వం నుంచి ప్రభుత్వ పెద్దల నుంచి ఉన్నా పార్టీ నష్టపోవచ్చు. ఒక మాటలో చెప్పాలి అంటే నిమ్మగడ్డకు కేంద్రంలో కూడా పరోక్ష సహాయ సహకారాలు ఉన్నాయి. అంటే ఆయన వెనుక బిజెపి ఉంది కాబట్టి జాగ్రత్త పడటం మంచిది.